Shama Parveen: అల్ ఖైదా ఉగ్రవాద మాడ్యూల్ సూత్రధారి షామా పర్వీన్ అరెస్టు
బెంగళూరుకు చెందిన మహిళను అరెస్టు చేసిన గుజరాత్ ATS;
అల్‌ఖైదా సూత్రధారి షామా పర్వీన్(30) అరెస్టు అయ్యారు. షామా పర్వీన్‌ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 22న నలుగురు అల్‌ఖైదా సభ్యులను అరెస్టు చేయడంతో.. షామా పర్వీన్ పేరు వెలుగులోకి వచ్చింది. విచారణలో తమ నాయకురాలు పర్వీన్ అని ఉగ్రవాదులు చెప్పారు. రహస్య, ఆటో డిలీటెడ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. సోషల్ మీడియా గ్రూపులో అన్ని రాష్ట్రాల సభ్యులు ఉన్నట్లు తేలింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు కుట్ర చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
అయితే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహించడంతో పాటు ఉగ్ర దాడులకు కుట్ర చేస్తున్నట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ హర్ష ఉపాధ్యాయకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. అనేక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తున్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి. ముస్లిం యువతను రెచ్చగొడుతూ.. దేశానికి వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించడానికి ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను వినియోగిస్తున్నట్లు తేలింది.
ఈ క్రమంలో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎస్పీ సిద్ధార్థ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ బృందం.. ఆయా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అల్‌ఖైదా ఉగ్రవాదులను గుర్తించింది. ఈ నెల 22న ఫర్దీన్ షేక్(అహ్మదాబాద్), సైఫుల్లా ఖురేషి(గుజరాత్), మహమ్మద్ ఫాయిక్(ఢిల్లీ), జీషన్ అలీ(ఉత్తరప్రదేశ్) ని అరెస్టు చేశారు. వీరిని విచారిస్తున్న క్రమంలో తమ నాయకురాలు షామా పర్వీన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ గ్రూపులోని ఇతర సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.