రేపు రాష్ట్రంలోని 49 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం-12, విజయనగరం-16, మన్యం-13, అల్లూరి-1, కాకినాడ-2, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
రానున్న 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాలుల పట్ల రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) కె.విజయానంద్ సూచించారు. వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ముందు జాగ్రత్త చర్యలు ముఖ్యమన్నారు. వడదెబ్బ తాకకుండా నీటిని అధికంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఈ మేరకు వీడియో సమావేశం ద్వారా సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
మరోవైపు తెలంగాణలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు, తీవ్రగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.