త్రివిధ దళాల్లో ఒకటైన వాయుసేనకు తదుపరి అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వాయు సేనకు వైస్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. వాయుసేన అధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అమర్‌ప్రీత్ సింగ్ సెప్టెంబరు 30న వాయు దళ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది.1964 అక్టోబరు 27న జన్మించిన ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1984 డిసెంబర్‌లో భారత వైమానిక దళంలో ప్రవేశించారు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో కమాండ్, సిబ్బంది, బోధనా, విదేశీ నియామకాలతో సహా అనేక కీలక పదవులను చేపట్టారు. అత్యంత అనుభవజ్ఞుడైన ఫ్లైయర్‌గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా గుర్తింపు పొందారు.