Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఎన్సీపీతో కలిసి బీజేపీకి షాకిచ్చిన షిండే
ఆసక్తికరంగా మారిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ సంస్థల్లో ఒకటిగా బీఎంసీకి పేరు ఉంది. అయితే ఈసారి ముంబయిని మించి, పెద్దగా ఎవరికీ తెలియని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్‌సీపీ, శివసేన విభజన తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు ఎంత గందరగోళంగా మారాయో అంబర్‌నాథ్ పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. మంగళవారం జరిగిన పరిణామం రాజకీయ వర్గాల్లో షాక్‌కు గురి చేసింది. 60 మంది సభ్యులున్న అంబర్‌నాథ్ కౌన్సిల్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఏక్‌నాథ్ షిండే శివసేనను అధికారానికి దూరంగా ఉంచేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. దీనికి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా మద్దతిచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాష్ట్ర స్థాయిలో మిత్రులైన ఈ పార్టీలే.. బీఎంసీ సహా పలు చోట్ల పరస్పరం కలవకుండా రాజకీయాలు చేస్తున్నాయి.
బీజేపీ–కాంగ్రెస్ పొత్తు రెండు పార్టీల్లోనూ కలకలం రేపింది. కాంగ్రెస్ అంబర్‌నాథ్ యూనిట్‌ను రద్దు చేసి, బీజేపీతో చేతులు కలిపిన 12 మంది నాయకులను సస్పెండ్ చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా బీజేపీ–కాంగ్రెస్ పొత్తును అంగీకరించబోమని స్పష్టం చేస్తూ, ఆ బంధాన్ని తెంచుకోవాలని పార్టీకి సూచించారు. ఈ పొత్తుపై షిండే శివసేనతో పాటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా తీవ్ర విమర్శలు చేసింది. శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్‌ను దేశం నుంచి తరిమేయాలని మాట్లాడే బీజేపీ, అదే పార్టీతో కలిసి పనిచేయడాన్ని ద్వంద్వ వైఖరిగా విమర్శించారు. అయితే.. శుక్రవారం మరో కీలక మలుపు తిరిగింది. అజిత్ పవార్ ఎన్‌సీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు బీజేపీ నేతృత్వంలోని ‘అంబర్‌నాథ్ వికాస్ అఘాడీ’కి మద్దతు ఉపసంహరించుకుని, ఏక్‌నాథ్ షిండే శివసేనకు మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో సస్పెండ్ అయిన కాంగ్రెస్ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. ఇప్పటికే 27 మంది సభ్యులతో ఉన్న షిండే శివసేన, ఎన్‌సీపీ మద్దతుతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి సహకారంతో మెజారిటీ దాటగలిగింది.
అయితే.. తాము షిండే వర్గం మద్దతు వెనుక కారణాన్ని వివరించిన ఎన్‌సీపీ కౌన్సిలర్లు, 2023లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ విడిపోయినప్పటి నుంచి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం తమకు ఇష్టం లేదన్నారు. అలాగే ప్రజల తీర్పు మహాయుతికే అనుకూలంగా ఉందని, కాంగ్రెస్‌తో పొత్తు ప్రజాభిప్రాయానికి విరుద్ధమని స్థానిక నేతలు వ్యాఖ్యానించారు. ఈ మొత్తం పరిణామాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చవాన్‌కు ఎదురుదెబ్బగా మారినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ–కాంగ్రెస్ పొత్తు ఆలోచన ఆయన నుంచే వచ్చిందన్న ప్రచారం ఉండగా, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన కౌన్సిలర్లను బీజేపీలో చేర్చడం రాజకీయంగా తిరుగుబాటుకు దారితీసిందని చర్చ సాగుతోంది. మొత్తంగా చూస్తే, అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాలు ఎంత అనూహ్యంగా, సంక్లిష్టంగా మారాయో మరోసారి రుజువు చేస్తున్నాయి.