ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్‌పై జరిగిన దాడిపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. సమగ్ర విచారణ జరపాలంటూ నాయకులు, మహిళా మోర్చా సభ్యులు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు. కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా ఉన్నారని దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ప్రశ్నించారు.
పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతీమాలీవాల్‌పై సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్‌సింగ్ అంగీకరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 'కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూంలో సీఎం కోసం స్వాతి ఎదురుచూస్తుండగా.. బిభవ్‌కుమార్ ఆమెతో అమర్యాదగా ప్రవర్తించాడు. దాడి చేశాడు. దీన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. బిభవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారు' అని తెలిపారు.
''దిల్లీ చీఫ్ సెక్రటరీని కేజ్రీవాల్ కొట్టారని గతంలో ఆరోపణ ఉంది. నిన్న ఆయన పీఏ రాజ్యసభ ఎంపీని కొట్టాడు. ఒక ముఖ్యమంత్రి నివాసంలో ఎంపీపై దాడి జరిగిందంటే ఇక వారికి రక్షణ ఎక్కడ ఉంటుంది. రాజ్యసభ ఛైర్మన్‌గా ఉప రాష్ట్రపతి దీనిని సుమోటోగా తీసుకోవాలని నేను కోరుతున్నాను'' అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు.