Bengaluru techie: మహిళా టెక్కీని చంపి ఆపై అగ్ని ప్రమాదంగా చిత్రీకరణ
బెంగళూరు మహిళా టెక్కీ మృతిలో సంచలన మలుపు
ఈ నెల మొదట్లో తూర్పు బెంగళూరులో జరిగిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. రామమూర్తినగర్‌లోని సుబ్రహ్మణ్య లేఅవుట్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్న శర్మిల (34) అగ్ని ప్రమాదం కారణంగా ఊపిరాడక మృతి చెందిందని పోలీసులు తొలుత భావించారు. అయితే, ఆ తర్వాత జరిగిన విచారణలో అది ప్రమాదం కాదని, పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని తేలింది.
శర్మిల నివసిస్తున్న ఫ్లాట్‌కు ఎదురుగా ఉండే 18 ఏళ్ల పీయూసీ విద్యార్థి కృష్ణయ్య (కేరళ వాసి), ఆమెపై మోహం పెంచుకున్నాడు. జనవరి 3వ తేదీన అర్ధరాత్రి సమయంలో బాల్కనీ కిటికీ ద్వారా ఆమె గదిలోకి ప్రవేశించిన నిందితుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. శర్మిల గట్టిగా ప్రతిఘటించడంతో ఆమె మెడపై బలంగా కొట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేశాడు. అనంతరం ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.
తర్వాత ఈ దారుణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితుడు పక్కా స్కెచ్ వేశాడు. హత్యకు సంబంధించిన ఆధారాలను తుడిచిపెట్టేందుకు పడకగదికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు ఇల్లంతా వ్యాపించడంతో, అందరూ ఆమె ఊపిరాడక చనిపోయిందని భావించారు. అయితే విచారణలో భాగంగా ఫోరెన్సిక్ ఆధారాలు, నిందితుడి కదలికలను గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఉన్న వ్యామోహమే ఈ ఘాతుకానికి దారి తీసిందని నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం అతడిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు.