బీహార్ ఎన్నికలకు ముందు లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో యాదవ్‌పై ట్రయల్ కోర్టు చర్యలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలన్న ఆయన పిటిషన్‌పై విచారణను వేగవంతం చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరింది.ఈ కేసులో ఆయనకు ట్రయల్ కోర్టు ముందు హాజరు నుంచి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. మే 29న ఢిల్లీ హైకోర్టు విచారణను నిలిపివేయడానికి ఎటువంటి బలమైన కారణాలు లేవని పేర్కొంది. ఏజెన్సీ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలన్న లాలూ యాదవ్ పిటిషన్‌పై హైకోర్టు సీబీఐకి నోటీసు జారీ చేసి, విచారణను ఆగస్టు 12కి వాయిదా వేసింది.
ల్యాండ్ ఫర్ జాబ్ కేసు అంటే ఏమిటి?
రైల్వేలో గ్రూప్ 'డి' పోస్టులలో ఉద్యోగాలు ఇప్పించినందుకు ప్రతిగా, అభ్యర్థులు లేదా వారి కుటుంబ సభ్యుల నుండి భూములను లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబ సభ్యుల పేరుతో బహుమతులుగా లేదా తక్కువ ధరలకు కొనుగోలు చేశారని ఆరోపణ ఉంది. ముంబై, కోల్‌కతా, జైపూర్, జబల్‌పూర్ వంటి వివిధ రైల్వే జోన్‌లలో నియామకాలు జరిగాయి. ఆసక్తికరంగా, ఈ ఉద్యోగాలు పొందిన వారందరూ బీహార్‌లోని పాట్నాకు చెందిన వారే కావడం గమనార్హం.
ఉద్యోగాల కోసం ఎటువంటి ప్రకటన లేదా పబ్లిక్ నోటీసు జారీ చేయకుండానే నియామకాలు జరిగాయని సీబీఐ ఆరోపించింది. అభ్యర్థుల దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో, వారికి ఉద్యోగాలు ఇవ్వడంలో అసాధారణ వేగం చూపారని కూడా సీబీఐ పేర్కొంది. రైల్వే శాఖ నియామకాలకు సంబంధించి నిర్దేశించిన నియమాలు, మార్గదర్శకాలను పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి.