Bihar Politics: సీఎంగా నితీష్ కుమార్, 19-20 తేదీల్లో ప్రమాణ స్వీకారం జరిగే ఛాన్స్..
ఇప్పటికే క్యాబినెట్ ఫార్ములా పూర్తి..
బీహార్‌లో ఘన విజయం తర్వాత ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో క్యాబినెట్ ఫార్ములా కూడా సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని భావిస్తున్నారు.ఎన్డీయే ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం లేదా గురువారం జరుగుతుందని, ఇది ప్రధాని నరేంద్రమోడీ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
బీహార్ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూల కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 సీట్లు సాధించింది. ఇదిలా ఉంటే, 18వ బీహార్ అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ రేపు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. 17వ అసెంబ్లీ రద్దును ఈ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీని తర్వాత నితీష్ కుమార్ తన రాజీనామాను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు సమర్పిస్తారు. దీంతో, తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు గవర్నర్‌కు సమాచారం ఇవ్వనున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ఆధారంగా నవంబర్ 19-20లలో తేదీలను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే, పాట్నాలోని గాంధీ మైదానంలో సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.