Budget 2026: ట్యాక్స్ ఉచ్చు నుంచి విదేశీ పెట్టుబడులకు విముక్తి.. భారత్ వేస్తున్న భారీ స్కెచ్ ఇదే!

Update: 2026-01-07 06:00 GMT

Budget 2026: గడిచిన పదేళ్లలో భారత మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మన దేశం దాదాపు అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. మన స్టాక్ మార్కెట్లు, ప్రభుత్వ బాండ్లు గ్లోబల్ ఇండెక్స్‌లలో భాగమయ్యాయి. అంతర్జాతీయ వ్యాపారాల్లో రూపాయి వాడకం కూడా పెరిగింది. అయితే, ఇన్ని విజయాలు ఉన్నా.. ఇప్పటికీ విదేశీ కంపెనీలను, ఇన్వెస్టర్లను వేధిస్తున్న కొన్ని పాత పన్ను చట్టాలు భారత్‌కు రావాలంటే వారిని భయపెడుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

విదేశీ కంపెనీల విషయంలో ఒక విచిత్రమైన సమస్య ఉంది. ఉదాహరణకు.. ఒక భారతీయ కంపెనీకి యజమానిగా ఒక విదేశీ కంపెనీ (కంపెనీ A) ఉందనుకుందాం. ఇప్పుడు ఆ విదేశీ కంపెనీ తన వ్యాపారాన్ని మార్చుకుంటూ మరో విదేశీ కంపెనీ (కంపెనీ B)తో కలిస్తే, సాంకేతికంగా భారతీయ కంపెనీ షేర్లు కూడా మారతాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఇలాంటి కంపెనీల విలీనాలకు పన్ను మినహాయింపు ఉన్నా, అందులోని షేర్ హోల్డర్ల విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కంపెనీ స్థాయి కలిసినా, షేర్ హోల్డర్ల మీద ట్యాక్స్ పడే అవకాశం ఉండటం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. బడ్జెట్‌లో దీన్ని సరిచేసే అవకాశం ఉంది.

ఇది కేవలం విదేశీ కంపెనీలకే కాదు, మన దేశానికి చెందిన దిగ్గజ సంస్థలకు కూడా సమస్యగా మారింది. చాలా భారతీయ కంపెనీలకు విదేశాల్లో అనుబంధ సంస్థలు ఉన్నాయి. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ఆ విదేశీ శాఖలను ఒకదానితో ఒకటి కలిపితే, ప్రస్తుతం భారతీయ కంపెనీలు భారీగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. అంతర్జాతీయంగా ఇలాంటి అంతర్గత మార్పులపై పన్నులు వసూలు చేసే పద్ధతి లేదు. కానీ మన దేశంలో ఈ భారం ఉండటంతో, భారతీయ కంపెనీలు తమ అంతర్జాతీయ వ్యాపారాలను పునర్వ్యవస్థీకరించుకోవడానికి వెనుకాడుతున్నాయి.

భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఒక కార్పొరేట్ హబ్‎గా మారుతోంది. ఈ క్రమంలో మన పన్ను వ్యవస్థ కూడా ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా మారాలి. బడ్జెట్ 2026లో గనుక ఈ పన్ను చిక్కుముడులను విప్పితే, విదేశీ పెట్టుబడులు మరింతగా వెల్లువెత్తే అవకాశం ఉంది. డీ-మెర్జర్ వంటి ప్రక్రియలకు కూడా ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. ఇదే జరిగితే భారత్ ప్రపంచస్థాయి వ్యాపార కేంద్రంగా మరింత వేగంగా ఎదుగుతుంది.

Tags:    

Similar News