RBI : బ్యాంకు బాస్‌లకు ఆర్‌బీఐ వార్నింగ్..ఆ 75 శాతం ఫార్ములా దాటితే ఇక చెక్.
RBI : బ్యాంకులు తమకు వచ్చిన నికర లాభాలను షేర్ హోల్డర్లకు డివిడెండ్ రూపంలో పంచుతుంటాయి. అయితే భవిష్యత్తులో ఏదైనా ఆర్థిక సంక్షోభం ఎదురైతే బ్యాంకుల దగ్గర తగినంత నిధులు ఉండాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. ఇకపై ఏ బ్యాంక్ అయినా సరే, తమ వార్షిక నికర లాభంలో 75 శాతం కంటే ఎక్కువ డివిడెండ్ ఇవ్వకూడదని కొత్త నిబంధనను ప్రతిపాదించింది. అంటే వచ్చిన లాభంలో కనీసం 25 శాతాన్ని భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులోనే ఉంచాలన్నమాట. ఈ నిబంధన అన్ని భారతీయ బ్యాంకులకు వర్తిస్తుంది. అయితే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్థానిక ప్రాంతీయ బ్యాంకులకు మాత్రం ఈ పరిమితిని 80 శాతంగా నిర్ణయించింది.
కేవలం లాభం ఉంది కదా అని పంచేయడం కాకుండా, సదరు బ్యాంకు బోర్డు సభ్యులు ముందుచూపుతో ఆలోచించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. భవిష్యత్తు వృద్ధి ప్రణాళికలు, మూలధన స్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డివిడెండ్ ప్రకటించాలి. ముఖ్యంగా, ఏ కాలానికి అయితే డివిడెండ్ ఇస్తున్నారో, ఆ సమయంలో బ్యాంకు ఖచ్చితంగా లాభాల్లోనే ఉండాలి. నష్టాల్లో ఉన్న బ్యాంకులు డివిడెండ్ ఇవ్వడానికి వీలు లేదు. ఇందులో మధ్యంతర డివిడెండ్‌లు కూడా కలిసే ఉంటాయి.
భారత్‌లో శాఖలు ఏర్పాటు చేసుకున్న విదేశీ బ్యాంకులు కూడా ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయి. ఈ బ్యాంకులు తమ భారతీయ శాఖల ద్వారా వచ్చిన లాభాన్ని విదేశాల్లో ఉన్న తమ హెడ్ ఆఫీసులకు పంపించవచ్చు. అయితే ఆడిట్‌లో ఏదైనా లోపం కనిపిస్తే లేదా ఎక్కువ మొత్తం పంపినట్లు తేలితే, ఆ విదేశీ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఆ అదనపు సొమ్మును తిరిగి భారత్‌కు పంపాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ ముందస్తు అనుమతి లేకుండా లాభాలను పంపే వెసులుబాటు ఉన్నా, ఆడిటింగ్ విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు.
బ్యాంకులు తమ లాభాలను ఎక్కువగా చూపించి డివిడెండ్లు పంచుతాయని భావిస్తే ఆర్‌బీఐ ఊరుకోదు. ఆడిట్ నివేదికలో ఏదైనా తేడా ఉన్నా లేదా అసాధారణ ఆదాయాన్ని నికర లాభంగా చూపినా, అటువంటి మొత్తాలను లాభం నుంచి మినహాయిస్తారు. ఒకవేళ ఏ బ్యాంక్ అయినా ఆర్‌బీఐ నిబంధనలను లేదా మార్గదర్శకాలను అతిక్రమిస్తే, డివిడెండ్ పంపిణీపై నిషేధం విధించే అధికారం కూడా ఆర్‌బీఐకి ఉంటుంది. ఈ ప్రతిపాదిత నిబంధనలపై ఫిబ్రవరి 5వ తేదీ వరకు ప్రజలు, బ్యాంకుల నుంచి సూచనలను ఆర్‌బీఐ ఆహ్వానించింది.