Budget 2026: నిర్మలమ్మ తొమ్మిదో రికార్డు..సామాన్యుడికి ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చేనా?
Budget 2026: ఫిబ్రవరి 1వ తేదీన భారత పార్లమెంటు వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వరుసగా తొమ్మిదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇది దేశ చరిత్రలో ఒక అరుదైన రికార్డు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మన దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఈసారి బడ్జెట్‌లో విప్లవాత్మక మార్పులు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం లోటును పూడ్చుకోవడమే కాకుండా, దేశంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించి జీడీపీ నిష్పత్తిని మెరుగుపరచడంపై ప్రభుత్వం ఈసారి గట్టిగా దృష్టి పెట్టబోతోంది.
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఈ బడ్జెట్‌లో తీపి కబురు అందే అవకాశం ఉంది. గత ఏడాది 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇచ్చి ఊరటనిచ్చిన ప్రభుత్వం, ఈసారి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని మరింత పెంచవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజల చేతిలో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బు మిగులుతుంది. అలాగే, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న సరళీకృత ఆదాయపు పన్ను చట్టం 2025 గురించి స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చి, ప్రజలను పాత పద్ధతి నుండి కొత్త దానికి మళ్లించేలా ప్రోత్సాహకాలు ఉండవచ్చు.
పరిశ్రమల విషయానికి వస్తే కస్టమ్స్ డ్యూటీ నిర్మాణంలో జీఎస్‌టీ తరహా సంస్కరణలు వచ్చే అవకాశం ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకులపై సుంకాలను తగ్గించి, స్థానిక తయారీని ప్రోత్సహించడం ద్వారా వస్తువుల ధరలను అదుపులోకి తీసుకురావాలని కేంద్రం చూస్తోంది. అలాగే, ఎంతో కాలంగా వివాదాల్లో చిక్కుకున్న దాదాపు 1.53 లక్షల కోట్ల రూపాయల కస్టమ్స్ వివాదాలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక ఎమ్నిటీ స్కీమ్ కూడా ప్రకటించవచ్చు. రక్షణ రంగంపై గ్లోబల్ టెన్షన్ల దృష్ట్యా కేటాయింపులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత కీలకమైన అంశం 8వ వేతన సంఘం. జనవరి 1, 2026 నుంచి దీనిని అమలు చేయాలనే డిమాండ్ బలంగా ఉంది. దీనిపై ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తే లక్షలాది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు భారీగా పెరుగుతాయి. అలాగే, 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను పెంచడం ద్వారా సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాలని చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం వికసిత్ భారత్ - ఎంప్లాయ్‌మెంట్ అండ్ లైవ్లీహుడ్ మిషన్ కింద కొత్త పథకానికి శ్రీకారం చుట్టవచ్చు.
చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు, అలాగే నగలు, చర్మం, వస్త్ర పరిశ్రమలకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక రాయితీలు లభించవచ్చు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక నిధులను కేటాయించనున్నారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి పెద్ద ప్లస్ కానుంది. మొత్తానికి సామాన్యుడి జేబుకు ఊరటనిస్తూనే, దేశాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసి ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేలా ఈ 2026 బడ్జెట్ ఉండబోతోంది.