Budget 2026 : నిర్మలమ్మ బడ్జెట్ బొనాంజా..టాక్స్ పేయర్స్ జేబులు నిండటం ఖాయం.

Update: 2026-01-16 06:30 GMT

Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతుండటంతో దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరి కళ్ళు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైపే ఉన్నాయి. గత బడ్జెట్‌లలో కొత్త టాక్స్ విధానాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వం, ఈసారి పెరుగుతున్న ధరలు మరియు మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ 2026లో వినిపించబోయే ఆ భారీ ప్రకటనల వివరాలు చూద్దాం.

ఈ ఏడాది బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు అందే అవకాశం ఉంది. గతంలో కొత్త టాక్స్ విధానంలో 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఊరటనిచ్చిన ప్రభుత్వం, ఈసారి పాత పన్ను విధానంలో కూడా మార్పులు చేసే దిశగా ఆలోచిస్తోంది. దీనివల్ల పాత పద్ధతిలోనే సేవింగ్స్ చేసుకునే మధ్యతరగతి ప్రజలకు టాక్స్ భారం తగ్గనుంది. అలాగే, ప్రస్తుతం ఉన్న రకరకాల టీడీఎస్ రేట్లను తగ్గించి, కేవలం రెండు లేదా మూడు శ్లాబుల్లోనే ఉంచడం ద్వారా పన్ను విధానాన్ని మరింత సరళతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే పన్ను మినహాయింపును 2 లక్షల నుంచి ఏకంగా 4 లక్షలకు పెంచే అవకాశం ఉంది. మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, అఫోర్డబుల్ హౌసింగ్ పరిమితిని 45 లక్షల నుంచి 75 లక్షల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ఎక్కువ మంది సామాన్యులకు గృహ రుణాలపై సబ్సిడీ మరియు టాక్స్ బెనిఫిట్స్ అందుతాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈవీ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించే ప్రకటన కూడా రావచ్చు.

షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల కోసం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఫ్రీ లిమిట్‌ను 1.25 లక్షల నుంచి 1.5 లక్షలకు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఇప్పటివరకు కేవలం పాత టాక్స్ విధానంలోనే ఉన్న హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయింపులను, ఈసారి కొత్త టాక్స్ విధానంలోకి కూడా తీసుకురావచ్చు. దీనివల్ల ఎక్కువ మంది కొత్త విధానం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.

ఈసారి బడ్జెట్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం జాయింట్ టాక్సేషన్. అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్నట్లుగా.. పనిచేసే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పన్ను చెల్లించే వెసులుబాటును కల్పించాలని ఐసీఏఐ సూచించింది. ఇది అమలైతే ఉద్యోగం చేసే దంపతులకు టాక్స్ సేవింగ్స్ భారీగా పెరుగుతాయి. అలాగే పాత టాక్స్ విధానంలో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి 75 వేలకు పెంచే అవకాశం ఉంది. ఈ మార్పులన్నీ అమలైతే 2026 బడ్జెట్ సామాన్యుల పాలిట వరంగా మారుతుంది.

Tags:    

Similar News