Budget 2026 : నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లో ఏం జరుగుతుంది? బడ్జెట్ టీమ్ ఎందుకు జైలు లాంటి గదిలోకి వెళ్తారు?
Budget 2026 : ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు, అంటే జనవరి 27న ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో హల్వా సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆర్థిక మంత్రితో పాటు ఆర్థిక శాఖలోని కీలక అధికారులు పాల్గొన్నారు. ఏదైనా శుభకార్యం చేసే ముందు తీపి తిని ప్రారంభించడం మన భారతీయుల ఆచారం. అందుకే బడ్జెట్ ముద్రణ ప్రారంభించే ముందు ఈ హల్వా వేడుకను నిర్వహిస్తారు.
ఈ హల్వా తిన్న వెంటనే బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే సుమారు 100 మందికి పైగా అధికారులు, సిబ్బంది ఒక ప్రత్యేక లాక్-ఇన్ పీరియడ్‌లోకి వెళ్లిపోతారు. అంటే వచ్చే 9-10 రోజుల వరకు వీరు నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లో ఉన్న బడ్జెట్ ప్రెస్ ప్రాంతాన్ని వదిలి బయటకు రాకూడదు. ఈ బేస్‌మెంట్ ఒక అభేద్యమైన కోటలా మారుతుంది. ఇక్కడ ఉండే వారికి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. చివరకు తమ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడటానికి అనుమతి ఉండదు.
ఎందుకింత కఠిన నిబంధనలు అంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే బడ్జెట్ వివరాలు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందే బయటకు పొక్కకూడదు. బడ్జెట్ సమాచారం ముందే తెలిస్తే స్టాక్ మార్కెట్లు తలకిందులు కావచ్చు లేదా వ్యాపారులు అక్రమాలకు పాల్పడవచ్చు. అందుకే, అత్యంత గోప్యతను పాటించడానికి వీరందరినీ ఒకే చోట ఉంచుతారు. వారికి అవసరమైన ఆహారం, విశ్రాంతి గదులు అన్నీ అక్కడే ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, వారి కుటుంబ సభ్యులు ఒక ప్రత్యేక నంబర్ ద్వారా సందేశం పంపవచ్చు, కానీ నేరుగా మాట్లాడలేరు.
గతంలో అంటే 2022లో కోవిడ్ కారణంగా ఈ వేడుక నిర్వహించలేదు. అలాగే 2024 ఎన్నికల ఏడాది కావడంతో రెండుసార్లు హల్వా సెర్మనీ జరిపారు. ప్రస్తుత 2026 బడ్జెట్ ఆదివారం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, ఈ గోప్యతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు నిరంతరం పహారా కాస్తుంటారు. ఫోన్ సిగ్నల్స్ రాకుండా జామర్లు కూడా అమర్చుతారు. ఈ స్థాయిలో కష్టపడి అధికారులు తయారు చేసే ఆ రెడ్ బ్యాగ్ లోని వివరాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.