National : ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్ట్.. తేజస్వీ యాదవ్‌పై మహారాష్ట్రలో కేసు నమోదు
ఆర్జేడీ నాయకుడు, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కేసు నమోదైంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనపై అభ్యంతరకరమైన పోస్ట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గడ్చిరోలికి చెందిన బిజెపి ఎమ్మెల్యే మిలింద్ నరోటే ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
ఇటీవల బిహార్‌లోని గయ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ముందు తేజస్వీ యాదవ్ మోదీని ఉద్దేశిస్తూ ఒక కార్టూన్‌ను పోస్ట్ చేశారు. ఆ కార్టూన్‌లో మోదీని ఒక దుకాణదారుడిగా చూపిస్తూ, ‘‘ప్రసిద్ధ జుమ్లా దుకాణం’’ అని రాసి ఉంది. దాంతో పాటు ‘‘ప్రతి హామీ ఒక జుమ్లా, దానికి 100 శాతం గ్యారంటీ’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ అభ్యంతరకరంగా ఉందని ఎమ్మెల్యే నరోటే ఆరోపించారు.
తేజస్వీ యాదవ్ స్పందన
ఎఫ్‌ఐఆర్ నమోదుపై తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘‘జుమ్లా అనే పదాన్ని వాడటం కూడా నేరంగా మారిపోయింది. ఎఫ్ఐఆర్‌లకు ఎవరు భయపడతారు? మేము ఎఫ్ఐఆర్‌లకు భయపడం, మేము ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతాం’’ అని అన్నారు. ఈ కేసులో ఆయనపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో కూడా తేజస్వీపై మరో కేసు నమోదైనట్లు సమాచారం.