పహల్గాం ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. ఆ ఘటన వీడియోలను విడుదల చేయాలని కేంద్రం యోచిస్తోంది. వీటితో పాటు గతంలో పాక్ ఉగ్రవాదులు భారత్‌లో పాల్పడిన దాడుల దృశ్యాలను బయటపెట్టాలని చూస్తోంది. అంతే కాదు పాక్ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పాయారు. ఈ ఘటనతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది.