భారతదేశం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లలో వాయు కాలుష్యం ఒకటి. ఈ విషయంలో మనదేశం అంతర్జాతీయ ర్యాంకుల్లో టాప్-5లో నిలుస్తోంది. అలాగే ప్రపంచంలోని 20 అత్యంత వాయు కాలుష్యం గల నగరాల్లో 13 నగరాలు మనదేశంలోనే ఉన్నాయని, వాటిలో మేఘాలయలోని బైర్ని హాట్ అగ్రస్థానంలో ఉందని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 పేర్కొంది. ఇక ప్రపంచంలోని అత్యంత కలుషితమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ టాప్ ప్లేస్ లో ఉన్నట్లు ఈ నివేదిక తేల్చిచెప్పింది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూఎయిర్ ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం, 2023లో భారత్ మూడో అత్యంత కాలుష్య దేశంగా ఉండగా, 2024 నాటికి కాస్త మెరుగుపడి ఐదో స్థానానికి చేరుకుంది. ప్రపంచంలోని టాప్-20 కాలుష్య నగరాల జాబితాలో పాకిస్థాన్లోని 4 నగరాలు, చైనాలోని ఒక నగరం కూడా ఉన్నాయి. నివేదిక ప్రకారం, భారత్లో పీఎం2.5 సాంద్రత 2023లో క్యూబిక్ మీటర్కు 54.4 మైక్రోగ్రాములు ఉండగా, అది 2024లో 7శాతం తగ్గింది. అయినప్పటికీ అత్యంత కాలుష్య నగరాల్లో 13 మనదేశంలోనే ఉండడం పర్యావరణ ప్రేమికులను ఆలోచనలో పడేస్తోంది.
టాప్-20 కాలుష్య నగరాలలో భారత్ నుంచి మేఘాలయలోని బైర్నిహాట్, ఢిల్లీ, పంజాబ్ లోని ముల్లనుర్, ఫరీదాబాద్ లోని, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, బివాడి, ముజఫర్ నగర్, హనుమాన్ గఢ్, నోయిడా ఉన్నాయి. మొత్తంగా దాదాపు 35 శాతం భారతీయ నగరాల్లో వార్షిక పీఎం2.5 సాంద్రత స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.