ENCOUNTER: ఎన్ కౌంటర్ మృతుల్లో 13 మంది మహిళా మావోలు
పక్కా వ్యూహంతోనే ఎన్ కౌంటర్... మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ;
ఛత్తీస్ గఢ్‌లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని బస్తర్ ఐజీ సుందర్ వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదు రాష్ట్రాల మోస్ వాంటెడ్ మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. విజయవాడకు చెందిన కమలేష్ అలియాస్ ఆర్కే కూడా మృతి చెందినట్లు ఐజీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని ఐజీ వెల్లడించారు.
పక్కా వ్యూహంతోనే ఎన్ కౌంటర్
పక్కా వ్యూహంతోనే ఎన్‌కౌంటర్ చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇందులో మొత్తం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ కి చెందిన 1500 మంది పోలీసులు పాల్గొన్నారని దంతెవాడ అడిషనల్ ఎస్పీ ఆర్కే బర్‌మన్ చెప్పారు. రెండు రోజులు ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. అక్టోబరు 3 ఉదయమే ఆపరేషన్ ప్రారంభించామని...దాని ప్రకారం కంపెనీ నెంబర్ 6, తూర్పు బస్తర్ డివిజన్ దళాలు గవాడి, థుల్‌థులి, నెందూర్, రెంగవయా గ్రామాల్లో ఉన్న మావోయిస్టుల గురించి సమాచారం తెలుసుకుని మరీ దాడి చేశామని చెప్పారు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని.. దానిని రూఢీ చేసుకున్న తర్వాతనే ఎన్‌కౌంటర్ ఆపరేషన్ మొదలుపెట్టామని తెలిపారు. ఈ ఆపరేషన్ చాలా కష్టం అయిందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మావోయిస్టులకు తెలియకుండా వెళ్ళడానికి...వారున్న ఎత్తైన కొండప్రాంత చేరుకోడానికి 10 కి.మీ వరకు బైక్స్ మీద.. ఆ తర్వాత 12 కి.మీలు నడిచి వెళ్ళారని చెప్పారు. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. నెందూర్, థుల్‌థులి గ్రామాల్లో అయితే చీకటి పడేవరకు కాల్పులు కొనసాగాయి. శుక్రవారమే 28 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. శనివారం మరో 3 లభ్యమయ్యాయి. ఈ ఆపరేషన్‌కు సెంట్రల్ రిజర్వ్ పోలీసు బలగాలు కూడా సహకారం అందించాయి అని ఆర్కే బర్‌మన్ చెప్పారు. మృతి చెందిన వారు అందరూ పీపుల్ లిబరేషన్ గెరిలా ఆర్మీకి చెందినవారని చెప్పారు. అయితే వారిలో ఎవరు ఎవరన్నది ఇంకా తెలియలేదని చెప్పారు. పూర్తిగా పరిశీలించాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. దీంట్లో భారీ ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏకే-47 రైఫిల్, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్‌సాస్, ఎల్‌ఎంజీతోపాటు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో కేవలం ఒక్క జవాన్ మాత్రమే గాయపడ్డారని..అతనికి చికిత్స జరుగుతోందని చెప్పారు.
ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరపాలి
ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని, వీటిపై సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో మృతుల పేర్లు, వివరాలు, ఫొటోలతో సహా బహిరంగపరచాలని కోరారు. ‘ఆపరేషన్ కగార్’ పేరిట హత్యాకాండ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.