సిక్కింలో మెరుపు వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మరణించగా.. 82 మంది గల్లంతయ్యారు. మొత్తం 14 వంతెనలు దెబ్బతిన్నాయని, 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు వారిలో ఒకర్ని సురక్షితంగా రక్షించగా.. మిగిలిన 22 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ వరదల కారణంగా మొత్తం 41 వాహనాలు నీటిలో మునిగిపోయినట్లు వెల్లడించారు.
ఒక ప్రదేశంలో.. గంట వ్యవధిలో 10 సెంటీమీటర్లకు మించి వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ గా చెబుతారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక సిక్కిం వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. రాత్రి 1.30 సమయంలో కుండపోత కారణంగా ఉత్తర సిక్కింలోని లొహాంక్ సరస్సు నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. ఆ ప్రవాహం తీస్తానదిలోకి చేరింది. దాంతో చుంగ్‌థాంగ్ డ్యామ్‌కు వరద పోటెత్తింది. చూస్తుండగానే నీటిమట్టం పెరిగి 778 మీటర్ల మేర నమోదవ్వడం, 50 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వరదనీరు రావడంతో అధికారులు డ్యామ్ గేట్లను ఎత్తివేశారు. బుధవారం మధ్యాహ్నానికి ఎగువన వర్షాలు కొనసాగడం, ప్రవాహ ఉధృతి అంతకంతకూ పెరగడంతో పలు చోట్ల డ్యామ్ దెబ్బతిన్నది. డ్యామ్ భాగాలు కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. మంగళవారం అర్ధరాత్రి డ్యామ్ గేట్లను ఎత్తివేయడంతో.. సింగ్టమ్‌లోని బర్దంగ్ వద్ద ఉన్న ఆర్మీ శిబిరాలను వరద ముంచెత్తింది. తీస్తానది వరద ఉధృతికి బలువాతర్ వంతెన, ఇంద్రాణీ స్టీల్ బ్రిడ్జి సహా 14 వంతెనలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
ల్యాంకో జలవిద్యుత్తు కేంద్రం సమీపంలోని మరో బ్రిడ్జి కూడా దెబ్బతిన్నదని వివరించారు. బుధవారం సాయంత్రానికి తూర్పు సిక్కింలోని ఖానితర్ వద్ద కూడా తీస్తానది నీటిమట్టం 298.4 మీటర్లుగా ఉన్నట్లు చెప్పారు. పశ్చిమబెంగాల్ ఉత్తరప్రాంతంలోని తీస్తానది పరీవాహక ప్రాంతాలకు కూడా వరద ముప్పు పొంచి ఉంది. జల్పాయిగురి జిల్లాలో కూడా సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.
మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిసా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ బుధవారం భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా ఈ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.