Kerala Congress: కేరళ కాంగ్రెస్‌లో ‘‘కాస్టింగ్ కౌచ్’’ కలకలం..
సిమి రోజ్‌బెల్‌ని పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్..;
మహిళా నటులపై కొందరు హీరోలు, ఇతర సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికే మాలీవుడ్‌ను కుదిపేస్తుండగా, తాజాగా ఆ మకిలి కాంగ్రెస్ పార్టీకి కూడా అంటుకుంది. అధినేతలతో ‘సన్నిహిత’ సంబంధాలు ఉన్న మహిళలకే పార్టీలో అవకాశాలు వస్తాయంటూ, లేకపోతే వేధింపులు తప్పవంటూ ఒక మహిళా కాంగ్రెస్ నేత చేసిన ఆరోపణలు ఆ పార్టీని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. దీంతో ఆరోపణలు చేసిన ఆమెను పార్టీ అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరించారు.
మీడియా ముందు మహిళా నేతలను అవమానించినందుకు సిమి రోజ్‌బెల్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు కేరళ పీసీసీ అధికార ప్రకటనలో తెలిపింది. రాజకీయ ప్రత్యర్థులతో కుమ్మక్కై, కాంగ్రెస్‌లోని లక్షలాది మంది మహిళా నాయకురాలు , పార్టీ కార్యకర్తలను మానసికంగా వేధించడం, పరువు తీయడమే లక్ష్యంగా రోజ్‌బెల్ ఆరోపణలు ఉన్నాయని కూడా ప్రకటన పేర్కొంది. కాగా తన బహిష్కరణపై రోజ్‌బెల్ స్పందించారు. పరువు, ప్రతిష్ట ఉన్న ఏ మహిళా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో మహిళలు దోపిడీకి గురవుతున్నారని, ఎర్నాకులంకి చెందిన కాంగ్రెస్ మహిళా నేత సిమి రోజ్‌బెల్ శనివారం సంచలన ఆరోపణలు చేయడం ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. పార్టీలో అవకాశాలు పొందేందుకు తరుచుగా మహిళలు దోపిడీకి గురవుతున్నారని ఆమె ఓ ప్రాంతీయ వార్తా ఛానెల్‌లో మాట్లాడారు. రోజ్‌బెల్ కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలపై లైంగిక ఆరోపణలు చేశారు. పురుష నాయకుల్ని ‘‘ఆకట్టుకోవడం’’ ద్వారానే మహిళలు ముఖ్యమైన స్థానాలకు ఎదుగగలరని, తరుచుగా ప్రతిభ, అనుభవం అవసరం లేదని ఆమె చెప్పారు.
రోజ్‌బెల్ ఆరోపణల్ని అబద్ధమని సతీశన్ తోసిపుచ్చారు. మేము ఆమెకు చాలా మద్దతు ఇచ్చామని, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ)లో కూడా పదవులు దక్కించుకుందని అన్నారు. ఆమె ఆరోపణలన్నీ అబద్ధమన్నారు. సిమి రోజ్‌బెల్‌పై మహిళా కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని, విచారణ జరుపుతున్నామని కేరళ పీపీసీ చీఫ్ సుధాకరన్ అన్నారు.