Karnataka CM Position : డీకేకి సీఎం పదవి ఇవ్వాలి.. కర్ణాటకలో హాట్ టాపిక్
కర్ణాటకలో సీఎం కుర్చీపై వివాదం చెలరేగుతోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ( DK Shivakumar ) సీఎం చేయాలని, ఆ పదవిలో ఉన్న సిద్ధరామయ్య తప్పుకోవాలని.. గురువారం వక్కలింగ వర్గానికి చెందిన ప్రముఖ మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి అభిప్రాయ పడ్డారు. బెంగుళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
డిప్యూటీ సీఎం శివ కుమార్ కూడా వక్కలింగ కులానికి చెందిన వ్యక్తే. ప్రతి ఒక్కరూ సీఎం అయ్యారని, ఆ అధికారాన్ని అనుభవించారని, కేవలం డీకే శివ కుమార్ మాత్రమే సీఎం కాలేదని కుమార చంద్రశేఖరనాథ స్వామి తెలిపారు. అయితే ఒకవేళ సిద్ధరామయ్య తన సీఎం పదవిని వదులుకుంటే, అప్పుడు శివకుమార్ సీఎం అవుతారని మఠాధిపతి పేర్కొన్నారు. సిద్ద రామయ్య, శివకుమార్ ఒకే స్టేజిపై ఉన్న సమయంలో చంద్రశేఖరనాథ స్వామి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీకే శివకుమార్ సీఎం కావాలని చెన్నగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవ రాజు శివగంగ కూడా డిమాండ్ చేశారు.
సీఎం సిద్ధరామయ్య దీనిపై రియాక్ట్ అవుతూ.. కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంశాన్ని చూసుకుంటుందన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, హైకమాండ్ ఏది నిర్ణయిస్తే అదే చేస్తామన్నారు. మరో వైపు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండాలని కర్ణాటకలో కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రులు అందరూ దీనిపై మాట్లాడడం ఆపేయాలని సీఎం సిద్దరామయ్య తెలిపారు.