Cyclone Michaung: వర్షం తగ్గింది.. వరద ఇంకా ఉంది

తమిళనాడులో ఉదృతంగా నదులు, వాగులు

Update: 2023-12-06 04:00 GMT

తమిళనాడులో వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. వరద ప్రభావం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నీట మునిగి ఉన్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల ప్రజలు పడవల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వరదల వల్ల విద్యుదాఘాతం, గోడ కూలడం వంటి ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగ్‌జాం తుపాను కారణంగా కురిసిన వర్షాలతో తమిళనాడులో నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో కూవమ్ నది ఉగ్రరూపం దాల్చింది. నెర్కుండ్రంలో ఓ వంతెన వరద నీటితో నిండిపోయింది. సమీపంలోని ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది.

భారీ వర్షాల కారణంగా సోమవారం చెన్నై ఎయిపోర్టును మూసివేసిన అధికారులు వరద తగ్గుముఖం పట్టడంతో ఇవాళ నీటిని తొలగించి విమాన రాకపోకలను పునరుద్ధరించారు.అటు వర్షాలు తగ్గుముఖం పట్టిన చోట విద్యుత్ పునరుద్ధరణ, చెట్ల తొలగింపు పనులు, ఇతర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో NDRF సిబ్బంది, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి.


తమిళనాడులో మిగ్ జాం తుపాను బీభత్సం నేపథ్యంలో అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటించారు. చెన్నైలోని కన్నపర్ తితల్‌లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరంలో వరద బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రులు ఉదయనిధి స్టాలిన్, సుబ్రమణియన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

రానున్న 24 గంటల్లో తమిళనాడులో భారీ వర్షాలు ఉండకపోవచ్చన్న వాతావరణశాఖ....ఉత్తర తీర ప్రాంతాలు, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలు, ఆఫీసులకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు.

Tags:    

Similar News