Lok Adalat 2026 : పెండింగ్ చలాన్లు ఉన్నాయా? అయితే లోక్ అదాలత్‌కు వెళ్లండి..కానీ తేదీ మారింది.
Lok Adalat 2026 : జాతీయ లోక్ అదాలత్ 2026 వేడుకలకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న లక్షలాది ట్రాఫిక్ చలాన్లను ఒకేసారి పరిష్కరించుకునేందుకు వాహనదారులకు ఇదొక సువర్ణావకాశం. సాధారణంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఈ లోక్ అదాలత్ మార్చి 14న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఢిల్లీ వాసులకు మాత్రం ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఉంది. అక్కడ లోక్ అదాలత్ నిర్వహణ తేదీని మార్చారు. ఢిల్లీలో నివసించే వారు తమ చలాన్లను క్లియర్ చేసుకోవాలంటే మార్చి 14 వరకు ఆగక్కర్లేదు లేదా ఆ రోజు వెళ్లాల్సిన పనిలేదు. అక్కడ తేదీ మారింది.
ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తాజా నిర్ణయం ప్రకారం.. ఢిల్లీలో లోక్ అదాలత్ మార్చి 14వ తేదీకి బదులుగా మార్చి 22, 2026 (ఆదివారం) నాడు జరగనుంది. రెండో శనివారం కోర్టులు పనిచేస్తుండటంతో ఈ మార్పు చేసినట్లు సమాచారం. ఈ లోక్ అదాలత్ ఢిల్లీలోని తీస్ హజారీ, కర్కర్ దూమా, రోహిణి, సాకేత్, ద్వారక, రౌజ్ అవెన్యూ వంటి ప్రధాన కోర్టు సముదాయాల్లో ఉదయం నుంచే ప్రారంభమవుతుంది. ఆటోమేటిక్ కెమెరాల వల్ల పడ్డ ఈ-చలాన్లు, పెండింగ్ జరిమానాల భారం నుంచి తప్పించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
లోక్ అదాలత్‌లో అన్ని రకాల చలాన్లు మాఫీ అవుతాయని అనుకుంటే పొరపాటే. కేవలం కాంపౌండబుల్ నేరాలకు సంబంధించిన చలాన్లను మాత్రమే ఇక్కడ పరిష్కరిస్తారు. అంటే అతివేగం (ఓవర్ స్పీడింగ్), రెడ్ లైట్ జంపింగ్, నో పార్కింగ్, హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, కాలుష్య నియంత్రణ పత్రం లేకపోవడం వంటి వాటికి లోక్ అదాలత్‌లో రాయితీ పొందవచ్చు లేదా పరిష్కరించుకోవచ్చు.
అయితే, కొన్ని తీవ్రమైన నేరాలకు మాత్రం ఇక్కడ తావు లేదు. మద్యం సేవించి వాహనం నడపడం (డ్రింక్ అండ్ డ్రైవ్), అతి ప్రమాదకరంగా రేసింగ్ చేయడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాహనాన్ని వాడటం వంటి కేసులను లోక్ అదాలత్‌లో తీసుకోరు. వీటికి కోర్టు నిబంధనల ప్రకారం పూర్తి శిక్ష లేదా జరిమానా భరించాల్సి ఉంటుంది. కాబట్టి, మీ వాహనంపై సాధారణ చలాన్లు ఉంటే వెంటనే ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని, మార్చి 22న ఢిల్లీలోని కోర్టులకు వెళ్లి క్లియర్ చేసుకోవచ్చు.