Ayodhya: అయోధ్యకు భక్తుల తాకిడి..

కిక్కిరిసిన శ్రీరామ జన్మభూమి దర్శన మార్గ్‌;

Update: 2025-02-17 05:45 GMT

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య )కు భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం లక్షలాది మంది యాత్రికులు అయోధ్యకు తరలివస్తున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని సందర్శిస్తున్నారు. ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో పుణ్యస్నానాల అనంతరం భక్తులు అట్నుంచి అటు అయోధ్య బాట పడుతున్నారు. అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడిని దర్శించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా అయోధ్యకు భక్తుల రద్దీ పెరిగినట్లు ఆలయ ట్రస్ట్‌ తెలిపింది. నిత్యం లక్షల్లో యాత్రికులు రామ్‌లల్లా (Ram Lalla) దర్శనానికి వస్తున్నట్లు పేర్కొంది. భక్తులు రామ్‌ లల్లాతోపాటు హనుమాన్‌గర్హి ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపింది. ఇక భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో శ్రీరామ జన్మభూమి దర్శన మార్గ్‌ రద్దీగా మారింది.

మరోవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో రామ్‌ లల్లా దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉద‌యం ఆరు గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఆల‌యాన్ని భ‌క్తుల ద‌ర్శనార్థం తెరిచి ఉంచ‌నున్నట్లు శ్రీరామ జ‌న్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. మొన్నటి వ‌ర‌కు ఆల‌యాన్ని ఉద‌యం 7 గంట‌ల‌కు తెరిచేవారు. ఇప్పుడు ఓ గంట ముందు సాధార‌ణ ప్రజ‌ల ద‌ర్శనం కోసం తెరుస్తున్నారు.

కాగా, పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి రోజున ముగియనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే 53 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.

Tags:    

Similar News