DHARMASTHALA: వందల్లో మహిళల ఖననం.. కానీ రికార్డులేమీ లేవు!
ధర్మస్థలలో మాస్ బరియల్ కలకలం...15 ఏళ్ల మరణ రికార్డులు మాయం... వందమందికిపై ఖననం చేసినట్టు కార్మికుడి వివరణ;
ధర్మస్థలలో మిస్టరీ మరణాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2000 నుంచి 2015 మధ్య జరిగిన వందకు పైగా అసహజ మరణాల రికార్డులు మాయం అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఆర్టీఐ కార్యకర్త జయంత్ చేసిన దరఖాస్తులో బెళ్తంగడి పోలీసులు ఈ కాలానికి చెందిన రిజిస్టర్లు తొలగించినట్టు వెల్లడైంది. దీనిపై ఆంగ్లపత్రికలో కథనం వెలువడింది. తాజాగా జయంత్ సిట్‌కు ఫిర్యాదు చేశారు. ఓ యువతి మృతదేహాన్ని అక్రమంగా ఖననం చేయడాన్ని తన కళ్లతో చూశానని పేర్కొన్నారు. అప్పట్లో పోలీసులు కూడా అక్కడే ఉన్నారని ఆరోపించారు.
ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించిన సిట్, అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టింది. ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు తాను వందకు పైగా మృతదేహాలను ఖననం చేశానని చెప్పడం కలకలం రేపింది. ఆయన చూపించిన తొమ్మిది, పదో పాయింట్లలో శనివారం తవ్వకాలు జరిపారు. ప్రారంభంలో ఎటువంటి ఆధారాలు లభించకపోయినా, అధికారుల పర్యవేక్షణలో బుల్డోజర్లతో తవ్వకాలు కొనసాగుతున్నాయి. అవశేషాలు దొరికినా, ఆధారాలు లేని పరిస్థితిలో వాటిని ఎవరిదిగా గుర్తించాలన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.