Old Notes : పాత, చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకుంటాయా ? ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవే.

Update: 2025-10-09 04:45 GMT

Old Notes : ఏదైనా నోటుకు ఒక జీవితకాలం ఉంటుంది. సాధారణంగా ఒక నోటు ఐదు నుండి పది సంవత్సరాల వరకు చెలామణిలో ఉండేలా తయారుచేస్తారు. ఆ తర్వాత ఆ నోట్ల స్థానంలో కొత్త నోట్లను ముద్రిస్తారు. అయితే, కొన్నిసార్లు నోట్లు తమ జీవితకాలం కంటే చాలా ముందుగానే పాడైపోవచ్చు. ముఖ్యంగా 10 రూపాయలు, 20 రూపాయల ముఖ విలువ నోట్లు ఎక్కువ చెలామణిలో ఉండటం వల్ల త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. నోట్లు మాసిపోవడం, చిరిగిపోవడం వంటివి జరిగి వాటిని ఉపయోగించడం అసాధ్యంగా మారవచ్చు. ఇలాంటి నోట్లను బ్యాంకులలో మార్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే, పిన్ చేసిన నోట్లు, పెన్నుతో గీసిన నోట్లు వంటి వాటిని మార్చుకోవడానికి వీలు లేదు. ఈ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియమావళిని రూపొందించింది. ఏ రకమైన నోట్లను మార్చుకోవచ్చు, మార్చుకోకూడదు అని స్పష్టంగా తెలిపింది.

మురికి/మాసిన నోట్లు  ఎక్కువ వాడకం కారణంగా నోట్లు మాసిపోయి ఉండవచ్చు. నోటు రెండు ముక్కలైనా, ఏ భాగం కూడా కోల్పోకుండా దాన్ని అతికించి ఉండవచ్చు. ఇలాంటి నోట్లను ఏ బ్యాంక్ కార్యాలయంలోనైనా మార్చుకోవచ్చు. ఒక వ్యక్తి బ్యాంక్‌కు వెళ్లి కౌంటర్‌లో 20 నోట్ల వరకు ఉచితంగా మార్చుకోవచ్చు. 20 కంటే ఎక్కువ నోట్లు ఉంటే, బ్యాంక్ మీకు వెంటనే మార్చి ఇవ్వకపోవచ్చు. కొన్ని రోజుల తర్వాత ప్రత్యామ్నాయ నోట్లను ఇవ్వవచ్చు లేదా డబ్బును మీ ఖాతాలో జమ చేయవచ్చు. దీనికి సర్వీస్ ఛార్జ్ విధించబడుతుంది.

చిరిగిన నోట్లు  నోటు రెండు కంటే ఎక్కువ భాగాలుగా చిరిగిపోయి అతికించి ఉండవచ్చు. లేదా ఏదో ఒక భాగం పూర్తిగా ఊడిపోయి ఉండవచ్చు. ఇలాంటి నోట్లను మ్యుటిలేటెడ్ లేదా చిరిగిన నోట్లుగా పరిగణిస్తారు. ఇలాంటి నోట్లను కూడా బ్యాంకులలో మార్చుకోవచ్చు. ఒక వ్యక్తి ఏ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఐదు నోట్ల వరకు ఉచితంగా మార్చుకోవచ్చు. ఈ నోట్ల గురించి బ్యాంకుకు ఏదైనా సందేహం ఉంటే, ఆ వ్యక్తికి రసీదు ఇచ్చి, ఆ నోట్లను ఇంకో బ్రాంచ్‌కు పంపి సమస్యను పరిష్కరించవచ్చు. ఈ నోట్ల సంఖ్య ఐదు కంటే ఎక్కువ ఉంటే, వాటిని కరెన్సీ చెస్ట్ బ్రాంచ్‌కు వెళ్లి మార్చుకోవచ్చు.

కాలిపోయిన, అతికించిన, బాగా శిథిలమైన నోట్లు  కొంత భాగం కాలిపోయిన, ఒకదానికి ఒకటి అంటుకుపోయిన ఇంకాస్త వాడితే చిరిగిపోయేలా బాగా శిథిలమైపోయిన నోట్లను ఈ కోవలోకి వస్తాయి. ఇలాంటి నోట్లను సాధారణ బ్యాంక్ కార్యాలయాలలో స్వీకరించరు. వీటిని ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌‎కు వెళ్లి మాత్రమే మార్చుకోవచ్చు. ఇక్కడ నిపుణులు నోటు పరిస్థితిని బట్టి దాని విలువను అంచనా వేసి చెల్లింపు చేస్తారు. ఈ నియమాలు తెలుసుకోవడం ద్వారా మీ వద్ద ఉన్న పాడైన నోట్లను సులభంగా మార్చుకోవచ్చు. అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు.

Tags:    

Similar News