Navy Officer Vinay Narwal Wife: ముస్లింలు, కశ్మీరీలకు వ్యతిరేకం కాదు పహల్గాంలో మరణించిన నేవీ ఆఫీసర్ భార్య
రక్తదాన శిబిరంలో ముస్లింలపై కీలక వ్యాఖ్యలు;
పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు చేశారు. వినయ్ నర్వాల్ గౌరవార్థం నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి హిమాన్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముస్లింలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముస్లింల పట్ల ఎలాంటి ద్వేషం లేదని ఆమె పేర్కొన్నారు. తనకు కాశ్మీరీల పట్ల గానీ.. ముస్లింల పట్ల గానీ ఎలాంటి ద్వేషం లేదని.. తాము శాంతిని మాత్రమే కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ.. న్యాయం కోసం గట్టిగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశ ప్రజలంతా కోపంగా ఉన్నారని.. అయినా కూడా కాశ్మీరీలకు.. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజలు వెళ్లాలని తాను కోరుకోవడం లేదని.. కేవలం శాంతిని మాత్రమే కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తన భర్త వినయ్ నర్వాల్ కూడా ఇదే కోరుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు.
గురుగ్రామ్‌కు చెందిన హిమాన్షి పీహెచ్‌డీ స్కాలర్. ఏప్రిల్ 16న నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్‌ను వివాహం చేసుకుంది. అనంతరం ఏప్రిల్ 19న గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అటు తర్వాత హనీమూన్ కోసమని విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు. కానీ ప్లాన్ కుదరకపోవడంతో పహల్గామ్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఏప్రిల్ 22న భర్తతో కలిసి సరాదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారి ముష్కరులు తుపాకులతో విరుచుకుపడ్డారు. అంతే ఒక్కసారిగా తూటాలకు వినయ్ నర్వాల్ నేలకొరిగారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త మృతదేహం దగ్గరే హిమాన్షి కుప్పకూలిపోయింది. తీవ్రంగా కన్నీటి పర్యాంతం అయింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక వినయ్ నర్వాల్‌కు హర్యానాలో సైనిక లాంఛనలతో అంత్యక్రియలు జరిగాయి. ముఖ్యమంత్రి సైనీతో పాటు కేంద్రమంత్రి ఖట్టర్, పలువురు నేతలు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇక ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాళులర్పించారు. అనంతరం హిమాన్షిని ఓదార్చారు. ఇక భర్త శవపేటికను కౌగిలించుకుని హిమాన్షి సెల్యూట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.