ఎగ్జిట్ పోల్స్ పై మరోసారి కీలక ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఓటర్లను ప్రభావితం చేసే ఏ చర్యనూ సమర్థించలేమని తెలిపింది. పార్లమెంట్ ఎన్నికలకు సీఈసీ పకడ్బందీ ఏర్పాట్లుచేస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 19 శుక్రవారం నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది. 2024 జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడించుకోవచ్చని ఈసీ తెలిపింది.
దేశంలో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశ పోలింగ్ శుక్రవారం ముగిసింది. ఈ విడతలో మొత్తం 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు.. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. 18 లక్షల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికల జరుగనున్నాయి.