Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం..

ఏకంగా ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు, విచారణకు రావాలని ఆదేశం

Update: 2023-10-31 04:30 GMT

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సోమవారం (అక్టోబర్ 30) ఈడీ సమన్లు జారీ చేశారు. నవంబర్‌ 2న విచారణకు హాజరు కావాలని అధికారులు పేర్కొన్నారు. పీఎంఎల్ ఏ సెక్షన్ 50ఏ కింద అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో దర్యాఫ్తును వేగవంతం చేసింది ఈడీ. ఇందులో భాగంగానే లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ. లిక్కర్ పాలసీ రూపకల్పన, మనీలాండరింగ్ ఆరోపణలు, ముడుపుల వ్యవహారాలపై కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజురోజుకూ ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, భారీగా డబ్బులు చేతులు మారడమే కాకుండా కోట్లాది రూపాయల ప్రజాధనం నష్టపోయిందనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తుంటే ఇదే కసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ఈ కేసులో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. 2023 ఫిబ్రవరి 26న ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పెటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలో కీలక పరిణామం జరిగింది.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ స్పందించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని అంతమొందించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అర్వింద్ కేజ్రీవాల్‌ను నకిలీ కేసులో ఇరికించి జైలుకు పంపే వరకూ వదిలిపెట్టేలా లేరని సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాతో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఇదే కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  

ఈ కేసులో 338కోట్లు చేతులు మారాయనే ఆరోపణకు సంబంధించి కొన్ని ఆధారాలను ఈడీ అందించినట్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. అదే సమయంలో కేవలం 6-8 నెలల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా దర్యాప్తు ఏజెన్సీలకు డెడ్‌లైన్ విధఘించింది. విచారణ మందకొడిగా జరిగితే మనీష్ సిసోడియా మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

Similar News