Maha Kumbh Mela: కుంభమేళాలో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించింది

పడవ నడిపే వ్యక్తి విజయగాధను పంచుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్;

Update: 2025-03-05 04:15 GMT

మహా కుంభమేళా ఓ కుటుంబం యొక్క తలరాత మార్చింది. కుంభమేళా ఆ కుటుంబానికి కాసుల వర్షం కురిపించింది. లక్ష కాదు.. కోటి కాదు.. ఏకంగా రూ.30 కోట్లు సంపాదించింది. ఈ వార్త చెప్పింది ఎవరో కాదు.. స్వయానా ముఖ్యమంత్రే చెప్పారు. ప్రజాప్రతినిధులు హాజరయ్యే శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 2025-26 బడ్జె్ట్‌పై చర్చ సందర్భంగా కుంభమేళాపై సీఎం యోగి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 130 పడవలు కలిగిన ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందని వెల్లడించారు. కుంభమేళాపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను మంగళవారం ముఖ్యమంత్రి తిప్పికొడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పడవలు నడిపిన వారంతా రోజుకి రూ.50,000 నుంచి 52,000 వేలు సంపాదించారని తెలిపారు. ఒక నేరం కూడా జరగకుండా 45 రోజులు ప్రశాంతంగా కుంభమేళా జరిగిందని స్పష్టం చేశారు. ఇక వేధింపులు, కిడ్నాప్‌లు, దోపిడీలు, హత్యలకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్లారన్నారు. రూ.3లక్షల కోట్ల ఆదాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కుంభమేళాను అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసించిందని యోగి గుర్తుచేశార.

హోటల్ పరిశ్రమకు రూ. 40 వేల కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసరాల రంగానికి రూ. 33 వేల కోట్లు, రవాణాకు రూ. 1.5 లక్షల కోట్ల మేర ఆదాయం లభించినట్టు ముఖ్యమంత్రి యోగి తెలిపారు. ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం వృద్ధికి ఈ కుంభమేళా ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. 

మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. మహా శివరాత్రి ఫిబ్రవరి 26న కుంభమేళా ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరిగింది. దాదాపు 66 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేశారు. ఇక రూ.3లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. దేశ, విదేశాల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు.

Tags:    

Similar News