కదులుతున్న బస్సుకు మంటలంటుకొన్న ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్ లక్నోలోని మోహన్లాల్గాంజ్ సమీపంలో ఇవాళ తెల్ల వారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 60 ప్రయాణికులతో కూడిన డబుల్ డెక్కర్ బస్సు ఢిల్లీ నుంచి బీహారు వెళుతోంది. మార్గమధ్యలో ఇవాళ తెల్లవారుజామున లక్నోలోని మోహన్లాల్ గంజ్ సమీపంలోని కిషనథ్ వద్దకు రాగానే బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో బస్సు డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలం నుంచి పారిపోయారు. విషయం గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. వెంటనే 5 ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికు లంతా గాఢనిద్రలో ఉన్నారు. వారు తేరుకునే లోపే బస్సునిండా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఐదుగురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.