Maharashtra Elections : 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన ఎన్సీపీ.

అత్యధిక స్థానాల్లో బరిలోకి కాంగ్రెస్!;

Update: 2024-10-23 07:30 GMT

 నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి నుంచి, ఛగన్ భుజ్‌బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ లిస్ట్‌లో వెలుగులోకి వచ్చిన విశేషమేమిటంటే.. 95% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు దక్కడం. ఈ జాబితాలోని ప్రముఖ నాయకుల్లో నవాబ్ మాలిక్, సనా మాలిక్ పేర్లు లేవు. అయితే, బారామతి అసెంబ్లీ స్థానం నుంచి అజిత్ పవార్ స్వయంగా పోటీ చేయనున్నారు.

ఇక మరోవైపు మహారాష్ట్రలో ఈసారి రాజకీయ పోటీ చాలా ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే, మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం 25 నెలల క్రితం జూన్ 2022లో కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) మధ్య చీలిక తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం, 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వానికి 202 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 102 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి కేవలం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 14 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు పలికారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి మరో ఐదు చిన్న పార్టీల మద్దతు కూడా కలుపుకున్నారు.

Tags:    

Similar News