Gas Cylinder : వలస కార్మికులకు కేంద్రం బంపర్ ఆఫర్.. అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా నిమిషాల్లో గ్యాస్ సిలిండర్లు.

Update: 2026-04-08 08:15 GMT

Gas Cylinder : మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి వద్ద చమురు రవాణాకు ఎదురవుతున్న ఆటంకాల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సొంత ఊర్లను వదిలి ఇతర నగరాల్లో బతుకుదెరువు కోసం నివసించే వలస కార్మికులకు ఊరటనిస్తూ, 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల రోజువారీ కోటాను రెట్టింపు చేసింది. ఇంధన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పెట్రోలియం శాఖ ఈ చర్యలు చేపట్టింది. సాధారణ గ్యాస్ కనెక్షన్లు లేని వారు, బ్యాచిలర్స్, వలస కూలీలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.

కోటా రెట్టింపు.. వలస కార్మికులకు వరం

సాధారణంగా గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్లకు పూర్తి కేవైసీ ప్రక్రియ, అడ్రస్ ప్రూఫ్ అవసరం ఉంటుంది. కానీ వలస కార్మికులకు ఇవన్నీ ఉండవు. అందుకే ప్రభుత్వం ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ కింద లభించే 5 కిలోల చిన్న సిలిండర్ల సరఫరాను పెంచింది. ఏప్రిల్ 6న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి రాష్ట్రంలో ఈ చిన్న సిలిండర్ల రోజువారీ పంపిణీని రెట్టింపు చేయాలని గ్యాస్ ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది. కేవలం ఒక గుర్తింపు కార్డు చూపిస్తే చాలు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్ద నేరుగా కౌంటర్లోనే ఈ చిన్న సిలిండర్లను కొనుగోలు చేయవచ్చు.

ధరల వివరాలు ఇలా ఉన్నాయి

ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్ ధరల ప్రకారం.. 5 కిలోల చిన్న సిలిండర్ ధర రూ.549గా ఉంది. అదే సమయంలో సాధారణ గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ ధర రూ.913గా కొనసాగుతోంది. ఈ 5 కిలోల సిలిండర్లపై ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వదు, ఇవి పూర్తిగా మార్కెట్ ధరలకే విక్రయించబడతాయి. అయినప్పటికీ, తక్కువ బడ్జెట్‌లో ఉండటం, సులభంగా లభించడటంతో వలస కార్మికులు వీటివైపే మొగ్గు చూపుతున్నారు. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 7.8 లక్షల చిన్న సిలిండర్లు అమ్ముడయ్యాయంటే వీటి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఊరట

యుద్ధం ప్రారంభమైన కొత్తలో ఇంధన కొరత దృష్ట్యా హోటళ్లు, ఇతర వ్యాపారాలకు వాడే కమర్షియల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం కేవలం 20 శాతానికే పరిమితం చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం, ఈ కేటాయింపులను 70 శాతానికి పెంచింది. అదే సమయంలో గ్యాస్ సిలిండర్ల నల్లబజారును అరికట్టేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,300 చోట్ల దాడులు నిర్వహించి అక్రమ నిల్వలను సీజ్ చేశారు. గ్యాస్ సరఫరా నిరంతరం కొనసాగుతుందని, ఎవరూ భయపడి అదనపు సిలిండర్లను కొని నిల్వ చేయవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

పీఎన్‌జీ, సీఎన్‌జీకి తొలి ప్రాధాన్యత

గృహాలకు పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు, వాహనాలకు వాడే సీఎన్‌జీ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆసుపత్రులు, ఎరువుల పరిశ్రమలు, గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్యాస్ కేటాయింపులు చేస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, తప్పుడు వార్తలను నమ్మవద్దని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది.

Tags:    

Similar News