E Commerce : 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల మార్కెట్.. ఆన్‌లైన్ షాపింగ్‌లో జెన్ జీ యువతదే రాజ్యం.
E Commerce : భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ రాబోయే కొన్నేళ్లలో ఊహించని స్థాయికి చేరుకోబోతోంది. ప్రముఖ గ్లోబల్ సంస్థలు గూగుల్, డెలాయిట్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2030 నాటికి భారత ఈ-కామర్స్ మార్కెట్ ఏకంగా మూడు రెట్లు పెరిగి 250 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.21 లక్షల కోట్లు) చేరుకోనుంది. ప్రస్తుతం 90 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఈ మార్కెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెన్ జీ యువత ధాటికి సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది. ది 250 బిలియన్ డాలర్ కామర్స్ ఫ్రాంటియర్ పేరుతో విడుదలైన ఈ నివేదిక భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును కళ్ళకు కట్టినట్లు చూపించింది.
కొత్తగా 15 కోట్ల మంది కస్టమర్లు
ఈ దశాబ్దం ముగిసే సమయానికి భారత డిజిటల్ మార్కెట్‌లోకి కొత్తగా 15 కోట్ల మంది కొనుగోలుదారులు తోడవుతారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో సుమారు 22 కోట్ల మంది జెన్ జీ వినియోగదారులు ఉండటం విశేషం. వీరు మొత్తం ఆన్‌లైన్ షాపింగ్ ఖర్చులో దాదాపు 45 శాతం వాటాను తమ గుప్పెట్లో ఉంచుకోబోతున్నారు. దీనివల్ల కంపెనీలు సామూహిక మార్కెటింగ్ కంటే వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు ప్రాధాన్యతనిచ్చే షాపింగ్ అనుభవాల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి కస్టమర్ ఏం కోరుకుంటున్నారో ముందే ఊహించి ఆఫర్లు ఇచ్చే స్థాయికి టెక్నాలజీ చేరుకుంటుంది.
క్విక్ కామర్స్.. 10 నిమిషాల్లోనే అన్నీ
ప్రస్తుతం నగరాలకే పరిమితమైన క్విక్ కామర్స్ భవిష్యత్తులో చిన్న పట్టణాలకు కూడా పాకబోతోంది. 2030 నాటికి ఇది 50 బిలియన్ డాలర్ల అతిపెద్ద విభాగంగా అవతరించనుంది. క్విక్ కామర్స్ వినియోగదారుల సంఖ్య 7 కోట్లకు చేరుతుందని అంచనా. కేవలం కిరాణా సామాగ్రి మాత్రమే కాకుండా ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులు కూడా 10-20 నిమిషాల్లోనే ఇంటికి వచ్చేస్తాయి. ఈ నాన్-ఫుడ్ కేటగిరీలే క్విక్ కామర్స్ అమ్మకాల్లో 45 శాతం వాటాను కలిగి ఉంటాయని నివేదిక వెల్లడించింది.
కంటెంట్ క్రియేటర్ల హవా
వచ్చే ఐదేళ్లలో క్రియేటర్ ఎకానమీ భారత రిటైల్ రంగాన్ని శాసించబోతోంది. 2030 నాటికి మనం చేసే ప్రతి 10 ఆన్‌లైన్ కొనుగోళ్లలో ఒకటి నేరుగా ఏదో ఒక సోషల్ మీడియా క్రియేటర్ స్టోర్ నుండి జరుగుతుందని అంచనా. లైవ్ కామర్స్ (లైవ్ వీడియో చూస్తూ షాపింగ్ చేయడం) ఒక్కటే 8 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా మారుతుంది. మొత్తం రిటైల్ ఖర్చులో 30 శాతాన్ని ఈ కంటెంట్ క్రియేటర్లే ప్రభావితం చేస్తారు. అంటే ప్రకటనల కంటే సెలబ్రిటీలు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్ల రికమెండేషన్లకే జనం ఓటేయబోతున్నారు.
ఏఐ - షాపింగ్‌ను మార్చేసే బ్రహ్మాస్త్రం
షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించనుంది. గూగుల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రోమా దత్తా చోబే ప్రకారం, ఏఐ వాడకం వల్ల రిటైల్ రంగ లాభాలు 30-35 శాతం వరకు పెరుగుతాయి. కస్టమర్లకు తమకు ఏం కావాలో సరిగ్గా చెప్పకపోయినా, వారి గత అలవాట్లను బట్టి ఏఐ అద్భుతమైన ఆప్షన్లను చూపిస్తుంది. దీనినే జెనరేటివ్ కామర్స్ అని పిలుస్తున్నారు. ఇక్కడ ఏఐ కేవలం వస్తువులను చూపడమే కాదు, కస్టమర్ అవసరాలకు తగ్గట్లుగా పరిష్కారాలను కూడా వెతికి పెడుతుంది.