Indian Airlines : భారత విమానయాన రంగంలో భారీ సంక్షోభం.. సీఈవోల మూకుమ్మడి రాజీనామా.. అసలేం జరుగుతోంది ?
Indian Airlines : భారత గగనతలంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ సంక్షోభం నెలకొంది. దేశీయ విమానయాన మార్కెట్‌లో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్న మూడు ప్రధాన ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. ప్రస్తుతం నాయకత్వ మార్పులతో సతమతమవుతున్నాయి. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఈ మూడు దిగ్గజ సంస్థల సీఈవోలు తమ పదవుల నుంచి తప్పుకోవడం ఏవియేషన్ రంగంలో పెను సంచలనంగా మారింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, విమాన ప్రమాదాలు, రెగ్యులేటరీ నిబంధనల ఒత్తిడి వెరసి.. భారత విమానయాన రంగం ఒక కఠినమైన పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోంది.
ముగ్గురు బాస్‌ల నిష్క్రమణ
మంగళవారం ఎయిర్ ఇండియా తన సీఈవో,మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి ముందే, మార్చి 19న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎండి అలోక్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అలోక్ సింగ్ ప్రస్తుతం ఇండిగోలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా చేరారు. ఇక దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగో నుంచి పీటర్ ఎల్బర్స్ అకస్మాత్తుగా తప్పుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇండిగో తన కొత్త సీఈవోగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ మాజీ బాస్ విలియం వాల్ష్‌ను నియమించుకున్నప్పటికీ, దీనికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉంది. ఈ కీలక మార్పులు భారత విమానయాన మార్కెట్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.
విమాన ప్రమాదం నుంచి ఆర్థిక సంక్షోభం వరకు
ఎయిర్ ఇండియాకు కష్టాలు జూన్ 2025లో అహ్మదాబాద్ సమీపంలో జరిగిన భయంకరమైన బోయింగ్ 787 ప్రమాదంతో మొదలయ్యాయి. ఈ ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోవడంతో డీజీసీఏ (DGCA) నిఘా పెంచింది. విమానాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండానే ప్రయాణాలు సాగించడం, అత్యవసర పరికరాల తనిఖీలో నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలపై ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీనికి తోడు పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేయడం, పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా సుమారు 2,500 విమానాలు రద్దవ్వడం ఎయిర్ ఇండియాను ఆర్థికంగా దెబ్బతీశాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా గ్రూప్ ఏకంగా రూ.9,808 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.
పైలట్ల అలసట, విమానాల రద్దు
మరోవైపు ఇండిగో కూడా అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. డిసెంబర్ 2025లో ఈ ఎయిర్‌లైన్ ఏకంగా 4,500 విమానాలను రద్దు చేసింది. పైలట్ల పనివేళలకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన కఠిన నిబంధనలను పాటించడంలో ఇండిగో మేనేజ్మెంట్ విఫలమైంది. క్రూ రోస్టర్‌ను సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వైఫల్యాలే సీఈవో పీటర్ ఎల్బర్స్ నిష్క్రమణకు దారితీశాయని సమాచారం. ప్రస్తుతం కంపెనీ వ్యవస్థాపకుడు రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు.
యుద్ధం, పెరుగుతున్న నిర్వహణ వ్యయం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడం, విమాన ప్రయాణ మార్గాలు మారడం వల్ల అదనపు ఖర్చు భారమవుతోంది. ముఖ్యంగా యూరప్, అమెరికా వెళ్లే విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో విమాన టికెట్ల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాను గాడిలో పెట్టాలని చూస్తున్న సమయంలో ఈ నాయకత్వ మార్పులు పెద్ద సవాలుగా మారాయి. కొత్త బాస్‌లు ఈ సంక్షోభం నుంచి విమానయాన సంస్థలను ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాలి.