Gujarat: గుజరాత్‌లో బిజెపికి షాక్
గుజరాత్‌లో పోటీ నుంచి తప్పుకున్న బిజెపి అభ్యర్థులు;
గుజరాత్‌లో అధికార భాజపాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. వడోదర సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజన్ భట్, సబర్ కాంత్ నుంచి టికెట్ పొందిన భికాజీ ఠాకూర్‌లు ఎన్నికల బరి నుంచి తప్పుకుని భాజపాకు గట్టి షాకిచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము పోటీకి దూరమవుతున్నామని నేతలిద్దరూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. తాజా పరిణామాలతో కొత్త అభ్యర్థల వేటలో భాజపా అధిష్ఠానం పడింది.
గుజరాత్‌లో రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార భాజపాకు గట్టి షాక్ తగిలింది. గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం భాజపా ప్రకటించిన అభ్యర్థుల్లోఇద్దరు పోటీ నుంచి తప్పకున్నట్లు ప్రకటించి ఆ పార్టీ అధిష్ఠానానికి షాకిచ్చారు. వడోదర నుంచి భాజపా అభ్యర్థిత్వం ఖరారు చేసిన సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్, సబర్‌కాంతా నుంచి భాజపా అభ్యర్థిగా ఉన్న భికాజీ ఠాకూర్ పోటీ నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము పోటీకి దూరమవుతున్నామని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.
వడోదర నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజన్ భట్‌కు భాజపా మరోసారి టికెట్ ఇచ్చింది. భట్‌కు మరోసారి టికెట్ ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకు నిరసనగా నియోజకవర్గంలో బ్యానర్లు వెలిశాయి. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి, వడోదర నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. వారణాసి నుంచి కొనసాగాలని నిర్ణయించుకోవడంతో వడోదర ఖాళీ అయింది. అప్పుడు అక్కడ నిర్వహించిన ఉప ఎన్నికలో దాదాపు 3 లక్షల ఓట్ల మెజారిటీతో రంజన్ భట్ విజయం సాధించారు. 2019లోనూ 5 లక్షల ఓట్ల మెజారిటీతో మరోసారి భట్ గెలుపు పునరావృతమైంది. దీంతో మరోసారి భాజపా అగ్రనాయకత్వం భట్‌కు టిక్కెట్ ఇచ్చింది. భట్‌కు టిక్కెట్ ఇవ్వడంపై స్థానిక నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భాజపా జాతీయ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జ్యోతిబెన్ పాండ్యా పార్టీ, అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఆ పరిణామాలతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు భట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనంతరం మాట్లాడిన భట్ కొందరు వడోదర గురించి చెడుగా మాట్లాడుతున్నారని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.
అటు సబర్‌కాంతా నుంచి టిక్కెట్ దక్కించుకున్న భికాజీ ఠాకూర్ కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో తాను వైదొలుగుతున్నట్లు ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. భికాజీ తొలిసారి లోక్‌సభ టిక్కెట్ దక్కించుకున్నారు. ఆయన ఇంటి పేరుపై చెలరేగిన వివాదం కారణంగానే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు సమాచారం. భికాజీ తమ ఇంటి పేరు మార్చుకున్నట్లు స్థానికంగా వార్తాలు రావడంతో వివాదం చెలరేగింది. వివాదం రోజురోజుకి ముదరడంతో తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు భికాజీ ఠాకూర్ వెల్లడించారు. తాజా పరిణామాలతో భాజపా అధిష్ఠానం ఈ స్థానాలకు కొత్త అభ్యర్థల వేటలో పడింది. గుజరాత్‌లోని26 లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో మే 7న పోలింగ్ జరగనుంది. గత రెండుసార్లు 26 కు, 26 సీట్లు కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది.