Economic Recession : ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని భారత్ ఎదుర్కోగలదా..?

Economic Recession : భారత్‌లో ఇప్పట్లో ఆర్థికమాంద్యం పరిస్థితులు ఉండకపోవచ్చు;

Update: 2022-10-02 09:30 GMT

Economic Recession : భారత్‌లో ఇప్పట్లో ఆర్థికమాంద్యం పరిస్థితులు ఉండకపోవచ్చు. ముఖ్యంగా భారత్ చేపడుతున్న సంస్కరణలు, పెట్టుబడులకు ప్రోత్సాహం, అతిపెద్ద దేశీయ మార్కెట్ కారణంగా మాంద్యం దెబ్బ పెద్దగా ఉండదు. అంతేకాదు, రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ షైనింగ్ స్టార్‌గా ఎదుగుతుందని చెబుతున్నారు. ప్రపంచంలోని పలు దేశాలు మందగమనంలో ఉంటే.. భారత్ మాత్రం 7 శాతం వృద్ధి రేటు, 2023-24లో 6.5 శాతం వృద్ది రేటు నమోదు చేస్తుందని ధైర్యంగా చెబుతున్నారు. ముఖ్యంగా మన మార్కెట్టే మనకు బలం. ఇండియాలో కొనుగోలుశక్తి ఎక్కువ.

అందుకే, మరో రెండేళ్లు భారత్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్‌కు విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కాకపోతే, ప్రపంచ ఆర్థికవ్యవస్థలో మందగమనం, ధరల పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపు వంటివి భారత్‌కు సవాలు విసురుతాయని మాత్రం గుర్తుంచుకోవాలి. ఆయా దేశాల ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ భారత్‌పైనా పడనుంది.

ఒకప్పుడు భారత్‌ను కూడా ఆర్థిక మాంద్యం చుట్టుముట్టింది. ఒకట్రెండుసార్లు కాదు.. నాలుగు సార్లు మాంద్యం వచ్చింది. 1958, 1966, 1973, 1980లో భారత్ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. దిగుమతి బిల్లులు భారీగా పెరగడంతో తొలిసారి ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది భారత్. 1965లో తీవ్రమైన కరవు వల్ల భారత్ వృద్ధి రేటు మరోసారి నెగిటివ్‌లోకి వెళ్లింది. 1972లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు నిలిచిన దేశాలకు ఆర్గనైజేషన్ ఆఫ్ అరబ్ పెట్రోలియం ఎక్స్‌పోర్ట్ కంట్రీస్ చమురు దిగుమతులను నిలిపివేసింది.

ఫలితంగా అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు 400 శాతం వరకు పెరిగాయి. ఆ ఏడాది భారత్‌లోనూ మైనస్ 0.3 శాతంగా వృద్ధి రేటు నమోదైంది. 1980లో ఇరాన్‌లో విప్లవం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలకు చమురు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయ విపణిలో మళ్లీ చమురు ధరలు పెరిగాయి. భారత్‌లోనూ చమురు దిగుమతుల బిల్లు రెట్టింపు అయ్యింది. దీంతో మైనస్ 5.2 శాతంగా వృద్ధి రేటు నమోదైంది.

ఒక దేశం ఆర్థిక మందగమనం నుంచి బయటకు రావాలంటే ఒక్కటే మార్గం. మొదట పెట్టుబడులను పెంచాలి. పెట్టుబడులు పెరిగితే, ఉద్యోగ కల్పన పెరుగుతుంది. ప్రజల చేతుల్లోకి డబ్బులు వెళ్తాయి. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. జీఎస్‌టీ లాంటి పరోక్ష పన్నులు కూడా తగ్గించాల్సి ఉంటుంది. వస్తువులపై జీఎస్‌టీ తగ్గించినప్పుడు.. ప్రజల చేతుల్లో మిగిలే డబ్బు పెరుగుతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోనంత వరకు ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదు. ఆర్థిక మాంద్యం అన్నదే రాదు. కాకపోతే.. ప్రపంచ దేశాలను మాంద్యం పీడిస్తున్నందున ఆ ఎఫెక్ట్ మాత్రం కచ్చితంగా ఉంటుంది.

Tags:    

Similar News