పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. తక్షణమే జల ఒప్పందం రద్దు అమల్లోకి వస్తుందని తెలియజేస్తూ జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాక్‌కు లేఖ రాశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహించడమే కారణమని పేర్కొన్నారు. అగ్రిమెంట్‌లో భాగంగా సంప్రదింపులకు విజ్ఞప్తిని పలుమార్లు పాక్ తిరస్కరించిందని గుర్తు చేశారు.
పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారత్ ఏ క్షణమైనా తమపై విరుచుకుపడొచ్చని పాకిస్థాన్ భయపడుతున్నట్టు తెలుస్తోంది. భారత పౌర విమానాలు, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లు తమ గగనతలంలోకి రాకుండా నిషేధించింది. లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయంపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చని పాక్ అంచనా వేస్తోంది. దీంతో పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ ‘PAF హెర్క్యులస్’ ద్వారా పెద్దఎత్తున తరలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
పాకిస్థాన్‌పై భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందన్న వార్తల నడుమ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాలూ వీలైనంత సంయమనం పాటించాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత దిగజారనివ్వొద్దని సూచించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు.