చైనాలోని తియాన్‌జిన్‌లో జరుగుతున్న 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల ఆత్మీయ భేటీ ఆకర్షణగా నిలిచింది. సోమవారం అధికారికంగా ప్రారంభమైన ఈ సదస్సులో వివిధ దేశాధినేతలతో పాటు మోదీ, పుతిన్ కూడా పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో ప్రధాని మోదీ పుతిన్‌ను ఆత్మీయంగా పలకరించి, కరచాలనం చేసి ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన 'ఎక్స్' ఖాతాలో పుతిన్‌తో సమావేశమైన చిత్రాలను పంచుకున్నారు. ‘‘పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’’ అని రాసుకొచ్చారు. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో కూడా మోదీ సంభాషించారు. సదస్సు ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు.
ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు
ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షికంగా సమావేశం కానున్నారు. ఈ భేటీపై అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా 50 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య టారిఫ్‌లు, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఆ దేశం ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించేందుకు నిధులు సమకూరుస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ ధరలు, పరిస్థితులను బట్టే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని భారత్ గతంలోనే స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ-పుతిన్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించుకోనున్నారు.