Jaishankar: కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన జై శంకర్
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌పై సంచలన ఆరోపణలు;
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని పదే పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. గతంలో ఒకసారి ఇలా చెప్పగా.. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో సమావేశం సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలను తోసిపుచ్చారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అమెరికా జోక్యం లేదని.. హాట్‌లైన్ ద్వారా ఇరు దేశాలు కాల్పుల విరమణపై చర్చించి విరమించినట్లు తెలిపారు. ఇందులో ట్రంప్ జోక్యం ఏ మాత్రం లేదని పేర్కొన్నారు.
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల తర్వాత జైశంకర్ తొలిసారి నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఓఎస్ రిపోర్టర్ సాండర్ వాన్ హూర్న్‌కు జై శంకర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో మతం పేరుతో 26 మందిని చంపేశారని.. ఇది చాలా క్రూరమైన ఉగ్ర దాడి అన్నారు. అంతేకాకుండా పర్యాటక రంగానికి హాని కలిగించడమే కాకుండా మతపరమైన విభేదాలు సృష్టించడానికేనన్నారు. మే 7-10 మధ్య ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు అనేక దేశాలు భారతదేశంతో సంప్రదింపులు జరిపాయని.. అలాగే అమెరికా కూడా సంప్రదించిందని పేర్కొన్నారు. చివరికి ఇరు దేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగినట్లు జై శంకర్ చెప్పారు.
ఈ దాడి కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీసే, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే లక్ష్యంతో జరిగిన ‘అనాగరిక’ చర్యగా అభివర్ణించారు. డెన్మార్క్, నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పాకిస్థాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై సంచలన ఆరోపణలు చేశారు. మునీర్ తీవ్రమైన మతపరమైన దృక్పథంతో నడిచే వ్యక్తి అని విమర్శించారు.