Jammu Kahmir Elections : ఆగస్ట్ 20వ తర్వాత జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు
అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశ ముందని ఆ పార్టీ కీలక నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేసినట్లు సమాచారం. అందుకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని సూచించారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆ పార్టీ కీలక నేతలు దీనిపై సమావేశమై చర్చించారు.
ఈ యాత్ర ఆగస్టు 19వ తేదీతో ముగియనుంది. అందువల్ల ఆగస్ట్ 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతుంది. బీజేపీ ఒంటరిగానే పోటీకి దిగుతుంది. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ప్రకటించే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉండదు అని అమిత్ షా వివరించారు. జమ్ము కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనానే కొనసాగనున్నారని సుస్పష్టమైంది.
కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, ఆ రాష్ట్ర ఎంపీలు జితేందర్ సింగ్, జుగల్ కిషోర్ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనాతోపాటు ఆ పార్టీ కీలక నేతలూ హాజరయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో.. దాదాపుగా అన్నీ జాతీయ రాజకీయ పార్టీలు వీటిపై దృష్టి సారించాయి.