Jammu Kashmir Terror Attack : రెచ్చిపోతున్న ఉగ్రవాదులు.. సామాన్యుల పైనా అటాక్..
Jammu Kashmir Terror Attack : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది.;
Jammu Kashmir Terror Attack : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్‌తో పాటు సాధారణ పౌరుడు గాయపడ్డాడు. జవాన్ పరిస్థితి నిలకడగా ఉండగా...పౌరుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరో వైపు పుల్వామాలో చనిపోయిన బిహార్ వలస కార్మికుడికి నితీష్ 2 లక్షల పరిహారం ప్రకటించారు.
జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుల్గాంలోని రిద్వాని ఏరియాలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో శుక్రవార సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి సైనిక బలగాలు. ఇదే సమయంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఐతే ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జవానుతో పాటు ఓ సాధారణ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పౌరుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా...జవాన్ కిరణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు ఆర్మీ అధికారులు. ప్రస్తుతం అతనికి శ్రీనగర్ ఆర్మీ బేస్‌లోని హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.
ఇక చనిపోయిన సాధారణ పౌరుడు కుల్గాంకు చెందిన మంజూర్‌లోన్‌గా గుర్తించారు. మృతుడికి రెండేళ్ల పాప ఉందని చెప్పారు స్థానికులు. మరోవైపు గురువారం పుల్వామాలో టెర్రరిస్టుల గ్రెనెడ్ దాడిలో బిహార్‌కు చెందిన ఓ వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు బిహార్ వలస కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
జమ్ము కశ్మీర్‌లో టెర్రరిస్టుల గ్రెనెడ్ దాడిలో బిహార్ వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోవడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మృతుని కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. డెడ్‌బాడీ స్వగ్రామానికి తెప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన మరో ఇద్దరు బిహారీలకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.