Justice Sanjeev Khanna: సుప్రీంకోర్టు 51వ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు పదవీ విరమణ
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తదుపరి సీజేఐగా నియామకం;
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు పదవీ విరమణ చేయనున్నారు. సుమారు ఆరు నెలల పాటు దేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సేవలందించారు. ఆయన స్థానంలో, సుప్రీంకోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా తన పదవీ విరమణకు ముందు తదుపరి సీజేఐగా జస్టిస్ బి.ఆర్. గవాయ్ పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు అధికారికంగా సిఫార్సు చేశారు. ఈ సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో జస్టిస్ గవాయ్ భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. న్యాయవ్యవస్థ సంప్రదాయం ప్రకారం పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఖన్నా, కాబోయే సీజేఐ జస్టిస్ గవాయ్‌తో కలిసి నేడు చివరిసారిగా ధర్మాసనంపై ఆసీనులవుతారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ ఖన్నాకు అధికారిక వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఖన్నా తన వీడ్కోలు ప్రసంగం చేసే అవకాశం ఉంది.
జస్టిస్ బి.ఆర్. గవాయ్ మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం 64 ఏళ్ల వయసున్న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసైన 65 ఏళ్లు పూర్తయ్యే వరకు, అంటే 2025 నవంబర్ 23 వరకు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు.
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ మార్చి 16, 1985న న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. మాజీ అడ్వకేట్ జనరల్, హైకోర్టు న్యాయమూర్తి అయిన రాజా ఎస్. భోంస్లే వద్ద శిక్షణ పొందారు. 1990 తర్వాత ఆయన బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో రాజ్యాంగ, పరిపాలనా చట్టాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రాక్టీస్ చేశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ తర్వాత నాగ్‌పూర్ బెంచ్‌కు గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పలు కీలక ప్రభుత్వ న్యాయ పదవులను నిర్వహించారు.
జస్టిస్ గవాయ్ నియామకం భారత న్యాయవ్యవస్థలో ఒక ముఖ్యమైన ఘట్టంగా పరిగణిస్తున్నారు. ఆయన అపారమైన అనుభవంతో పాటు, షెడ్యూల్డ్ కులాల నేపథ్యం నుంచి వచ్చిన కొద్దిమంది ప్రధాన న్యాయమూర్తులలో ఒకరిగా నిలవడం, భారత న్యాయవ్యవస్థలో పెరుగుతున్న సమ్మిళితత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.