మనీలాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర ( B. Nagendra ) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం సిద్దరామయ్యకు సమర్పించగా, ఆయన దాన్ని గవర్నర్‌కు పంపించారు. నిధుల దుర్వినియోగానికి తమను సీనియర్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని KMVSTDC బోర్డు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాసి మే 26న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ శాఖ మంత్రి బి.నాగేంద్రపై మనీలాండరింగ్ ఆరోపణలు మొదలయ్యాయి.
సూసైడ్ నోట్‌లో అతడు పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.187 కోట్ల ఎస్టీ కార్పొరేషన్ నిధులు అనధికారిక బ్యాంక్ ఖాతాలకు బదిలీ అయ్యాయి. ఈ కార్పొరేషన్ నాగేంద్ర పర్యవేక్షణలోని శాఖ కిందకు వస్తుంది. ఈ మొత్తంలో రూ.88.62 కోట్లు హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీల ఖాతాలకు చట్టవిరుద్ధంగా బదిలీ అయ్యాయి. ఈ వ్యవహారంపై యూనియన్ బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేయడంతో విచారణ కొనసాగుతున్నది. మరోవైపు కర్ణాటక సర్కారు కూడా ఈ అవినీతి బాగోతంపై సిట్ విచారణ చేస్తున్నది.