Arvind Kejriwal : పోలీస్ ఆఫీసర్‌పై కోర్టుకు ఫిర్యాదు చేసిన కేజ్రీవాల్‌

Update: 2024-03-23 05:44 GMT

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌ ఓ పోలీస్ ఆఫీసర్‌పై కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈడీ ఆఫీస్ నుంచి కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో ఏసీపీ ఏకే సింగ్ తనతో అనుచితంగా ప్రవర్తించారని, అతడిని తన సెక్యూరిటీ విధుల నుంచి తప్పించాలంటూ రౌస్ అవెన్యూ కోర్టుకు దరఖాస్తు అందజేశారు. కాగా గతంలో మనీశ్ సిసోడియాను మెడ పట్టుకుని తీసుకెళ్లిన పోలీస్ ఆఫీసర్ కూడా ఏకే సింగే కావడం గమనార్హం.

లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు కస్టడీ విధించడం సంచలనంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీకి సీఎం అయిన ఆయనను అరెస్ట్ చేయడంపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో అరెస్టును ఖండించాయి. ఇప్పుడు ఏకంగా కస్టడీకి ఇవ్వడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే జైలులో ఉన్న కవిత, మనీశ్ సిసోడియాతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించొచ్చు.

ఆమ్ ఆద్మీ పార్టీని నడిపించేది ఎవరు ?

అవినీతిపై పోరాటంతో ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతి మకిలికి బలవుతోంది. ఆప్ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ తరహాలోనే కేజ్రీవాల్ కూడా ఇప్పట్లో జైలు నుంచి బయటికొచ్చేలా కనిపించడం లేదు. దీంతో బయట పార్టీని నడిపించడానికి నేతలు కరవయ్యారు. అతిశీ, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ పేర్లు వినిపిస్తున్నా.. వారికి పాలనా అనుభవం అంతంతే. రాజకీయంగానూ బీజేపీకి ఎదురొడ్డి నిలబడటం కత్తి మీద సామే.

Tags:    

Similar News