DY Chandrachud: మా పిల్లలది ప్రత్యేక పరిస్థితి.. అందుకే ఇల్లు మారడం కష్టమవుతోంది; మాజీ సీజేఐ
లగేజీ ప్యాక్ చేసుకున్నాం..వెళ్ళిపోతాం అన్న మాజీ సీజేఐ;
మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్( తనకు కేటాయించిన అధికారిక బంగ్లాను ఇంకా ఖాళీ చేయలేదు. కాలపరిమితి దాటినా ఆయన ఆ ఇంటి నుంచి వెళ్లిపోవడం లేదు. దీంతో విసుగెత్తిన సుప్రీంకోర్టు.. రెండు రోజుల క్రితం కేంద్రానికి లేఖ రాసింది. మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్‌పై విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. ఇంట్లో ఉన్న లగేజీ మొత్తం ప్యాక్ చేసుకున్నామని, త్వరలోనే భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి మరో ప్రభుత్వ కిరాయి ఇంటికి వెళ్లనున్నట్లు చెప్పారు. చంద్రచూడ్ భార్య కల్పన కాగా, ఆ జంటకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ ఇద్దరూ దివ్యాంగులే. అయితే సీజేఐగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి న్యూఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్ 5లో ఆయన నివాసం ఉంటున్నారు.
తనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాలో ఎందుకు ఎక్కువ సమయం ఉండాల్సి వస్తుందో డీవై చంద్రచూడ్ చెప్పారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఉన్న లగేజీని ప్యాకప్ చేశామని, కొంత లగేజీ కొత్త ఇంటికి తరలించామని, కొంత స్టోర్‌రూమ్‌లో ఉందన్నారు. సీజేఐ డీవై చంద్రచూడ్ 2024, నవంబర్ 8వ తేదీన రిటైర్ అయ్యారు. బంగ్లా ఎక్స్‌టెషన్ గురించి పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. అయితే తన కూతుళ్లు దివ్యాంగులని, వాళ్లు ఎప్పుడూ వీల్‌చైయిర్‌లో ఉంటారని, వాళ్లు ఆరోగ్యం దృష్ట్యా .. బంగ్లా ఖాళీ చేయడం ఆలస్యం అయ్యిందన్నారు.
కూతుళ్లు ప్రియాంకా, మహి.. వింత వ్యాధితో బాధపడుతున్నారని, వాళ్ల అవసరాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయని, కూతుళ్లు ఇద్దరికీ నిమలైన్ మయోపథి అనే వ్యాధి ఉందని, జన్యుపరమైన ఆ వ్యాధి వల్ల వాళ్ల ఎముక మాంసం దెబ్బతింటుందన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్లకు చాలా ఉన్నత ప్రమాణాలతో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని, ప్రత్యేకమైన నర్సులు వాళ్లను చూసుకుంటారని, కూతుళ్లకు అనువైన రీతిలో ఉండే ఇంటి కోసం వెతికామని, కానీ ఢిల్లీలో అలాంటి ఇళ్లు దొరకడం లేదని, ఇద్దరు కూతుళ్లను చూసుకోవాల్సిన బాధ్యత తమమీదే ఉందన్నారు. అయితే కొత్త ఇళ్లు పూర్తి అయిన సమాచారం అందగానే ఆ ఇంట్లోకి వెళ్లనున్నట్లు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.
తన పెద్ద కూతురు ప్రియాంకా.. 44 రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందినట్లు చెప్పారు. షిమ్లాలో హాలీడే కోసం వెళ్లినప్పుడు ఆ అమ్మాయి చాలా ఇబ్బందిపడినట్లు తెలిపారు. ట్రాచెస్టమీ ట్యూబ్‌తో ఆమె చికిత్స జరుగుతోందన్నారు. తమ కూతుళ్లకు నిరంతరం ఛాతి, శ్వాసకోస, నరాల సంబంధిత థెరపీ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు రెగ్యులర్‌గా పెయిన్, స్పీచ్ చికిత్స కూడా జరుగుతోందన్నారు. గతంలో మాజీ సీజేఐలు కూడా అధికార నివాసాల్లో ఎక్స్‌టెన్షన్ తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. సీజీఐ యూయూ లలిత్, ఎన్వీ రమణ తో పాటు ఇతర టాప్ జడ్జీలు ఆ అవకాశాన్ని వాడుకున్నట్లు చంద్రచూడ్ చెప్పారు.
రిటైర్మెంట్ సమయంలో జరిగిన పరిణామాల గురించి జస్టిస్ చంద్రచూడ్ వివరిస్తూ.. తన తర్వాత బాధ్యతలు స్వీకరించిన సీజేఐ సంజీవ్ ఖన్నాతో బంగ్లాను ఖాళీ చేసే అంశాన్ని మాట్లాడినట్లు చెప్పారు. సీజేఐ బంగ్లాలోనే కొనసామని జస్టిస్ ఖన్నా తనకు చెప్పినట్లు చంద్రచూడ్ తెలిపారు. ఎందుకంటే జస్టిస్ ఖన్నా ప్రభుత్వ బంగ్లాలో ఉండాలనుకోలేదన్నారు. ఖన్నా హామీ నేపథ్యంలో చంద్రచూడ్ అక్కడే ఉంటున్నారు. రిటైర్మెంట్ తర్వాత కేవలం ఆర్నెళ్ల వరకే ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. కానీ ఈ ఏడాది మే 31 వరకు అదనంగా పొడిగింపు ఇచ్చారు. ఆ కాలపరిమితి దాటడంతో చంద్రచూడ్‌ను బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి సుప్రీం లేఖ రాసింది.