Earthquake : ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 69 మంది మృతి

147 మందికి గాయాలు

Update: 2025-10-01 04:30 GMT

 ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా 69 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. మంగళవారం రాత్రి సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ (Philippine)లో వచ్చిన ఈ భూకంపం రిక్టర్‌ స్కేలుపై 6.9గా నమోదైంది. సెబు ప్రావిన్స్‌లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. ఈ నగరంలోనే 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ కొంతమంది మరణించగా.. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుంది. భూకంపం కారణంగా 147 మంది గాయపడ్డారని జాతీయవిపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇండోనేసియాలో కూలిన పాఠశాల భవనం

ఇక, శాన్‌ రెమిజియో పట్టణంలో ముగ్గురు కోస్ట్‌గార్డ్‌ అధికారులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు మరో ఆరుగురు మరణించినట్లు వైస్‌ మేయర్‌ ఆల్ఫీ రేనెస్‌ తెలిపారు. బోగో నగరంలోని అనేక ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. భూకంపం నేపథ్యంలో అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. లేటె, సెబు, బిలిరాన్‌ తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఆ తర్వాత సునామీ హెచ్చరికలను అధికారులు ఎత్తేశారు. కాగా, సెబూ ప్రావిన్స్‌ దీనిని రాష్ట్రీయ విపత్తుగా ప్రకటించింది. అదేవిధంగా భూకంప ప్రభావిత ప్రాంతాలైన బోగో, స్యాన్‌ రెమిగో, టెబ్యులాన్‌, మెడెల్లిన్‌ పట్టణాలు కూడా విపత్తుగా ప్రకటించాయి. భూకంప ధాటికి సెబూలోని దశాబ్దాల కాలంనాటి సెయింట్‌ పీటర్‌ చర్చ్‌ కూలిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News