Kolkata : కోల్‌కతాలో ప్రమాదంపై మమత దిగ్భ్రాంతి.. నష్టపరిహారం ప్రకటన

Update: 2024-03-18 05:25 GMT

క్వాలిటీ లేని నిర్మాణాలు మనుషుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇందుకు మరో ఉదాహరణ వెస్ట్ బెంగాల్ లో జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో (Kolkata) నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని నగర మేయర్‌ ఫిర్హాద్‌ హకీమ్‌ అనుమానం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఆదివారం రాత్రి గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సాక్షులు తెలిపారు. ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాత్రంతా అధికారులు సహాయక చర్యల్లో బిజీగా గడిపారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి కూడా ఆర్థిక సాయం అందించనున్నారు. కోలుకునేందుకు వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం మమత.

రాత్రి సమయంలో బిల్డింగ్ లో ఎవరూ లేకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని తెలుస్తోంది. పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడిసెలపై శిథిలాలు పడటంతో అందులో ఉన్నవాళ్ల ప్రాణాలు పోయాయి. శిథిలాలు వెలికితీస్తే కానీ.. మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Tags:    

Similar News