ఢిల్లీ ఎక్సయిజ్ విధానం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 31 వరకు పొడిగిస్తూ రౌజ్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను కూడా అదే రోజున చేపట్టనున్నట్టు తెలిపింది. సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం విధానంలో అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ, మనీలాండరింగ్ చేశారంటూ ఈడీ వేర్వేరుగా కేసులు పెట్టాయి.
ఈ కేసుల్లో ఆయన గతేడాది ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నారు. కాగా, తనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలంటూ సిసోడియా చేసిన వినతిని మంగళవారం హైకోర్టు నిరాకరించింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న భార్య సీమాను వారానికి ఒకసారి పరామర్శించేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. ట్రయల్ కోర్టుకు పత్రాలు సమర్పించడంలోను, చార్జిషీటు దాఖలు చేయడంలోనూ ప్రాసిక్యూషన్ ఎలాంటి జాప్యం చేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది.