నిజమైన సేవకుడు అహంకారం కలిగిఉండడనీ.. ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పని చేస్తాడు అంటూ ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ( Mohan Bhagwat ) చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ తరుణంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ( Yogi Adityanath ), భాగవత్ ల మధ్య భేటీ జరగనున్నట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భాగవత్ తో యోగి సమావేశం కానున్నారు. వారి మధ్య లోక్ సభ ఎన్నికల ఫలితాలు, ఉత్తర్ ప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ విస్తరణతో పాటు పలు అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. లోక్ శభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది. అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో షాక్ తగిలింది. 80 స్థానాలకుగానూ 33 సీట్లనే సొంతం చేసుకుంది. 2019లో ఆ సంఖ్య 62గా ఉంది. విపక్ష
ఇండియా కూటమి 43 చోట్ల గెలుపొందింది.
ఈ ఫలితాల అనంతరం ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ లో ఒక వ్యాసం ప్రచురితమైంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయని, మోదీపైనే ఆధారపడ్డారని, వీధుల్లో ప్రజల గొంతుకలను వినలేదని ఆ వ్యాసం లో కీలక వ్యాఖ్యలు ఉన్నాయి. స్థానిక నేతలను తక్కువ చేసి చూడటం, పార్టీ ఫిరాయించిన వారి టికెట్లు ఇవ్వడం, బాగా పని చేసిన పార్లమెంటు సభ్యులకు టికెట్లు ఇవ్వకపోవడం వికటించిందని ఆర్ఎస్ఎస్ వ్యాసం అభిప్రాయపడింది.