BBC : పహల్గామ్ ఉగ్ర దాడిపై బీబీసీ తప్పుడు కథనాలు, కేంద్రం స్ట్రాంగ్ కౌంటర్
బీబీసీ ఉద్దేశాలేంటో తెలియజేయాలని ప్రస్తావన;
పహల్గామ్ ఉగ్ర దాడిపై అంతర్జాతీయ మీడియా పక్షపాతం ప్రదర్శిస్తోంది. పాకిస్థాన్‌కు అనుకూలంగా.. భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇప్పటికే ది న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఉగ్ర దాడిని మిలిటెంట్ దాడిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పట్టపగలు ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 26 మందిని హతమార్చారు. కళ్ల ముందు ఇంత స్పష్టంగా ఘోరం కనిపించింది. ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా ఉగ్ర దాడిని ఖండిస్తుంటే.. న్యూయార్క్ టైమ్స్ మాత్రం తప్పుగా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. మిలిటెంట్ కాదు టెర్రరిస్ట్ దాడి అని సరి చేసింది. తాజాగా బీబీసీ కూడా అదే జాబితాలో చేరింది.
‘కాశ్మీర్‌లో జరిగిన దాడి తర్వాత పాకిస్థాన్ వీసాలను భారతదేశం రద్దు చేసింది’ అనే శీర్షికతో బీబీసీ కథనం ప్రచురించి.. అందులో పహల్గామ్ దాడిని మిలిటెంట్ దాడిగా పేర్కొంది. ఈ కథనంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ఇలాంటి పక్షపాత ధోరణి ఏంటి? అని ఇండియా బీబీసీ అధిపతి జాకీ మార్టిన్‌కు కేంద్రం లేఖ రాసింది. వాస్తవాలేంటో పరిశీలించాలని కోరింది. ఈ మేరకు పహల్గామ్ దాడికి సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ పంపించింది. పహల్గామ్ దాడిపై బీబీసీ ఉద్దేశాలేంటో పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
పెహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ జాతీయులకు జారీ చేసే అన్ని వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీసా పొంది భారత్‌లో ఉంటున్న వారు వెంటనే వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. 12 క్యాటగిరీల కింద స్వల్ప కాల వ్యవధి వీసాదారులు ఈ నెల 27లోగా దేశం వదిలి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. సార్క్ వీసా కలిగి ఉన్న వారికి ఏప్రిల్ 26, మెడికల్ వీసాలు ఉన్న వారికి ఏప్రిల్ 29 డెడ్‌లైన్‌గా విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల వ్యవధిలో 537 మంది పాక్ పౌరులు, దౌత్యవేత్తలు అటారీ-వాఘా సరిహద్దు వెంబడి దేశాన్ని వదిలి పాక్‌కు తిరిగి వెళ్లిపోయారు. అదేవిధంగా భారత్‌కు చెందిన 14 మంది దౌత్యవేత్తలు సహా 850 మంది ఈ అంతర్జాతీయ సరిహద్దు గుండానే భారత్‌కు చేరుకున్నారు. ఒక వేళ ఆదేశాలు ధిక్కరించి, ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ లోగా భారత్ విడిచి వెళ్లని పాకిస్థానీయులను అధికారులు అరెస్ట్ చేస్తారు. వారికి మూడేండ్ల జైలు శిక్ష, లేదా రూ.3 లక్షల జరిమానా లేక రెండు శిక్షలూ విధిస్తారు.